
రమణీయం రాయరు రథోత్సవం
మంత్రాలయం రూరల్: ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠంలో ప్రహ్లాదరాయల రథోత్సవం రమణీయంగా సాగింది. బుధవారం రాత్రి శ్రీమఠం ప్రాంగణ వీధుల్లో ప్రహ్లాదరాయల పంచ రథోత్సవాలు వైభవంగా జరిగాయి. ముందుగా వెండి అంబారి, చెక్క, వెండి, బంగారు, నవరత్న రథాలపై ఉత్సవమూర్తిని కొలువుంచి శ్రీమఠం ప్రాంగణంలో ఊరేగించారు. రథోత్సవాలతో శ్రీమఠం శోభాయమానంగా మారింది.
అల్లూరి పోరాటం స్ఫూర్తిదాయకం
కర్నూలు(సెంట్రల్): మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పోరాటం స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్ పి.రంజిత్‌బాషా కొనియాడారు. బుధవారం అల్లూరి సీతారామరాజు వర్ధంతిని పురస్కరించుకొని కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో ఆయన చిత్రపటానికి కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారత స్వాతంత్య్ర పోరాటంలో అల్లూరి పాత్ర ఎనలేనిదన్నారు. ఆయన స్ఫూర్తిని కొనసాగించేందుకు ప్రతి ఒక్కరూ ప్రతినబూనాలన్నారు. కార్యక్రమంలో ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, ఎస్‌డీసీ చిరంజీవి, టూరిజం అధికారి రామాంజనేయులు, సీపీఓ హిమప్రభాకరరాజు, కలెక్టరేట్ ఏఓ విజయశ్రీ పాల్గొన్నారు.
సహాయ సంక్షేమాధికారి బి.మద్దిలేటికి బెస్ట్ అవార్డు
● ఉత్తమ హెచ్‌డబ్ల్యూఓగా కె.ప్రమీలారాణి
కర్నూలు(అర్బన్): జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలోని కర్నూలు సహాయ సంక్షేమాధికారిగా విధులు నిర్వహిస్తున్న బి.మద్దిలేటి స్టేట్ బెస్ట్ అవార్డును అందుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ వసతి గృహాల్లో ఇంటర్మీడియెట్ పరీక్షా ఫలితాల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించేందుకు కృషి చేసిన ఐదుగురు సహాయ సంక్షేమాధికారులకు రాష్ట్ర ప్రభుత్వం బెస్ట్ అవార్డులను అందించింది. ఇందులో కర్నూలు ఏఎస్‌డబ్ల్యూఓ మద్దిలేటికి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా వీరాంజనేయ స్వామి అవార్డును అందించారు. అలాగే ఓర్వకల్ ప్రభుత్వ బాలికల వసతి గృహంలో 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో వంద శాతం విద్యార్థినీలు ఉత్తీర్ణులయ్యేందుకు కృషి చేసిన వసతి గృహ సంక్షేమాధికారిణి కె.ప్రమీలారాణికి కూడా ఉత్తమ వసతి గృహ సంక్షేమాధికారిగా అవార్డును అందించారు.
ఇంటర్ అడ్వాన్స్‌డ్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
కర్నూలు(సెంట్రల్): ఈనెల 12 నుంచి 20వ తేదీ వరకు జరిగే ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జేసీ డాక్టర్ బి.నవ్య అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణపై జిల్లా స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలకు 15,501 మంది జనరల్ అభ్యర్థులు, 791 మంది ఒకేషనల్ విద్యార్థులు, మొత్తం 16,292 మంది హాజరు కానున్నట్లు తెలిపారు. వీరి కోసం 52 సెంటర్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అలాగే రెండో సంవత్సరం పరీక్షలకు సంబంధించి మొత్తం 5,032 మంది విద్యార్థులు ఉన్నారని, వీరి కోసం 24 సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు. ఆయా పరీక్షా కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో ఆర్‌ఐఓ గురువయ్యశెట్టి, డీవీఈఓ సురేష్‌బాబు పాల్గొన్నారు.

రమణీయం రాయరు రథోత్సవం

రమణీయం రాయరు రథోత్సవం

రమణీయం రాయరు రథోత్సవం