రేపటి నుంచి ఒంటిపూట బడులు

- - Sakshi

కర్నూలు సిటీ: ప్రభుత్వ గుర్తింపు పొందిన జిల్లా పరిషత్‌, మున్సిపల్‌, ఎయిడెడ్‌, ప్రైవేట్‌ పాఠశాలలకు రేపటి(సోమవారం) నుంచి ఒంటి పూట బడులు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు స్కూళ్లను నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నెలలోని 2వ శనివారం పని దినంగా పరిగణించాలని, అన్ని స్కూళ్లలో తాగు నీటి సదుపాయాలను కల్పించాలని, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు సిద్ధంగా ఉంచుకోవాలని స్పష్టం చేశారు. పాఠశాలల్లో ఆరుబయట, చెట్ల కింద తరగతులు నిర్వహించరాదని సూచించారు. మధ్యాహ్నం భోజనం పెట్టిన తరువాతే విద్యార్థులను ఇళ్లకు పంపించాలని ఉత్తర్వులో పేర్కొన్నారు. దాతల సహకారంతో మధ్యాహ్నం విద్యార్థులకు మజ్జిగ అందించాలని సూచించారు. పదో తరగతి పరీక్ష కేంద్రాలుగా ఉన్న హైస్కూళ్లకు పరీక్ష రోజున సెలవు ప్రకటించాలని, ఆ సెలవు రోజులను ఈ నెల 30వ తేదీలోపు పని చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

సూపరింటెండెంట్లు

ఇక అడ్మినిస్ట్రేషన్‌ ఆఫీసర్లు

కర్నూలు కల్చరల్‌: అటవీశాఖలోని మేనేజర్లు, సూపరింటెండెంట్ల అడ్మినిస్ట్రేషన్‌ ఆఫీసర్ల హోదా పొందారు. ఈ మేరకు ప్రభుత్వ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ నీరభ్‌కుమార్‌ ప్రసాద్‌ ఉత్తర్వులు జారీ చేశారు. హోదా మారినప్పటికీ వేతనంలో ఎలాంటి మార్పు ఉండదని ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ మార్పు ఈనెల 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఒక మేనేజర్‌, ఏడుగురు సూపరింటెండెంట్లు.. మొత్తం 8 మంది హోదా మారింది. దీంతో అటవీ శాఖ ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ కర్నూలు కార్యాలయం ఏవో టి. రామచంద్ర రావు, ప్రధాన కార్యదర్శి సి. మహమ్మద్‌ అసేన్‌ హర్షం వ్యక్తం చేశారు.

రేపు కలెక్టరేట్‌లో ‘స్పందన’

కర్నూలు(సెంట్రల్‌): స్పందన కార్యక్రమాన్ని సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంతోపాటు అన్ని మండల, డివిజన్‌, మునిసిపల్‌ కార్యాలయాల్లో కూడా ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు.

డిగ్రీ పరీక్షల్లో ఆరుగురు డిబార్‌

కర్నూలు సిటీ: రాయలసీమ యూనివర్సిటీ పరిధిలో శనివారం జరిగిన డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షల్లో ఆరుగురు విద్యార్థులు డిబార్‌ అయ్యారు. ఉదయం జరిగిన పరీక్షలకు 4,126 మంది విద్యార్థులకు గాను 3,802 మంది, మధ్యాహ్నం పరీక్షలకు 4,644 మంది విద్యార్థులకు గాను 4,093 మంది హాజరైనట్లు వర్సిటీ పరీక్షల విభాగం అధికారులు తెలిపారు.

Read latest Kurnool News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top