కర్నూలు(అర్బన్): పేదింటి ఆడబిడ్డల కల్యాణానికి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న వైఎస్సార్ కల్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా పథకాల కింద ఆర్థిక సహాయం పొందేందుకు వివాహమైన 30 రోజుల్లో సంబంధిత గ్రామ/వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని కర్నూలు డివిజినల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ బాలక్రిష్ణారెడ్డి చెప్పారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ మేరకు సాంఘిక సంక్షేమ శాఖ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ ముద్డాడ రవిచంద్ర జీఓ జారీ చేశారన్నారు. గతంలో వివాహం అయిన అనంతరం 60 రోజుల్లోగా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉండేదని, ప్రస్తుతం సమయాన్ని 30 రోజులకు కుదించారన్నారు. జిల్లాలో 2022 అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు 692 మంది దరఖాస్తు చేసుకున్నారని, వీరిలో ఈ ఏడాది ఫిబ్రవరిలో అర్హులైన 271 మందికి రూ.2.31 కోట్లు విడుదల చేయడం జరిగిందన్నారు. మిగిలిన వారికి మే నెలలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ పథకం కింద ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, మైనారిటీ, దివ్యాంగులు, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లోని ఆడపిల్లల పెళ్లికి ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందన్నారు. ఎస్సీ, ఎస్టీలకు రూ.1 లక్ష, కులాంతర వివాహం చేసుకుంటే రూ.1.20 లక్షలు, బీసీలకు రూ.50 వేలు, కులాంతర వివాహం చేసుకుంటే రూ.75 వేలు, మైనారిటీలకు రూ.1 లక్ష, దివ్యాంగులకు రూ.1.50 లక్షలు, భవన నిర్మాణ కార్మికులకు రూ.40 వేలు అందించడం జరుగుతుందన్నారు.