
మాట్లాడుతున్న ప్రతాపరెడ్డి
నంద్యాల(అర్బన్): జాబ్ మేళాల నిర్వహణ ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని నంద్యాల ఈఎస్సీ ప్రభుత్వ పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ శ్రీనివాసప్రసాద్, జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి ప్రతాపరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, సీడాప్, జిల్లా ఎంప్లాయిమెంట్ ఆధ్వర్యంలో స్థానిక పాలిటెక్నిక్ కళాశాలలో శనివారం గ్రీన్‌టెక్ ఇండస్ట్రీస్–20, సిగ్ని–50, అరవిందో ఫార్మసీ–40 తదితర ప్రముఖ కంపెనీలకు సంబంధించి జాబ్ మేళా నిర్వహించారు. జిల్లాలోని 480 మంది నిరుద్యోగ యువతీ యువకులు హాజరు కాగా 110 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. వీరికి ఆయా కంపెనీలో ఉద్యోగాలు కల్పిస్తామన్నారు.
ఇక నుంచి ఉచితంగా
‘కృత్రిమ గర్భధారణ’
కర్నూలు(అగ్రికల్చర్): మేలు జాతి పశుసంపదను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉచితంగా కృత్రిమ గర్భధారణ సూదులు వేయాలని నిర్ణయం తీసుకుందని జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ కార్యనిర్వహణాధికారి డాక్టర్ రాజశేఖర్ తెలిపారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ అవకాశం ఏప్రిల్ 1 నుంచి జూలై 31 వరకు ఉంటుందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు కృత్రిమ గర్భధారణ సూదికి రూ.40 ప్రకారం రైతుల నుంచి వసూలు చేస్తున్నారని, ఇక నుంచి అన్ని పశువైద్యశాలలు, గోపాలమిత్ర సెంటర్లలో ఉచితంగా వేస్తారని తెలిపారు. అయితే పశువులకు చెవిపోగు/కమ్మ వేసి ఉండాలన్నారు. సూదులు వేసిన తర్వాత ఇనాఫ్ పోర్టల్‌లో వివరాలు అప్‌లోడ్ చేయాలని ఆయన సూచించారు.
యువతి అదృశ్యం
మిడుతూరు: తలముడిపి గ్రామానికి చెందిన మేకల బాలచెన్నయ్య తన కుమార్తె పరిమళ కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శనివారం ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తిరిగి రాకపోవడంతో బంధువులు, ఇరుగు పొరుగు వారిని విచారించినా ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో బాలచెన్నయ్య పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ మారుతిశంకర్ తెలిపారు.

మేకల పరిమళ (ఫైల్)