
డిగ్రీ అడ్మిషన్లు వెంటనే ప్రారంభించండి
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): విద్యాసంవత్సరం ప్రారంభమై నెల రోజులు పూర్తవుతున్నా కానీ డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభంపై రాష్ట్ర ప్రభుత్వం నేటికీ ప్రకటన చేయకపోవడం దారుణమని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్‌యూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.వినోద్‌కుమార్ అన్నా రు. స్థానిక సున్నపుబట్టీల సెంటర్ సమీపంలో ఉన్న సంఘం కార్యాలయంలో పీడీఎస్‌యూ జిల్లా కార్యవర్గ సమావేశం సంఘం జిల్లా అధ్యక్షుడు ఐ.రాజేష్ అధ్యక్షత ఆదివారం జరిగింది. సమావేశానికి వినోద్‌కుమార్ హాజరై మాట్లాడుతూ అడ్మిషన్లు ఆలస్యం కావడం వల్ల పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రకటన కూడా ఆలస్యమవుతాయన్నారు. ఫలితంగా ఏపీ పీజీ సెట్, ఐసెట్ వంటి ఉమ్మడి పరీక్షలు కూడా ఆలస్యంగా జరుగుతాయన్నారు. 90 రోజులలో నిర్వహించాల్సిన సెమిస్టర్‌ను కుదించడం, కొన్నిసార్లు సెమిస్టర్ ప్రారంభమై రెండు నెలలకే పరీక్షలు నిర్వహించాల్సి వస్తోందని, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె. భాస్కర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మహర్షి, నగర అధ్యక్షుడు ధీరజ్ కృష్ణ్ణ, కార్యదర్శి సింధు, సభ్యులు పాల్గొన్నారు.
భక్తిశ్రద్ధలతో సూర్యోపాసన సేవ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో ఆదివారం సూర్యోపాసన సేవ నిర్వహించారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని రాజగోపురం వద్ద సూర్యభగవానుడి చిత్రపటానికి ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం జరిగిన సూర్యోపాసన సేవ, సూర్యనమస్కారాల్లో ఉభయదాతలు, భక్తులు పాల్గొన్నారు.