
ఎన్టీటీపీఎస్ ఉద్యోగి అనుమానాస్పద మృతి
ఇబ్రహీంపట్నం: ఎన్టీటీపీఎస్ అగ్నిమాపక దళ విభాగంలోని వాహన డ్రైవర్ దొమ్మాళి కృష్ణారావు (57) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాదపడుతున్న అతనికి కుటుంబ సభ్యులు ఆపరేషన్ చేయించారు. అయినా అరోగ్యం సహకరించకపోవడంతో మళ్లీ విజయవాడ వైద్యశాల్లో చికిత్స చేయించి గురువారం రాత్రి ఇంటికి తీసుకొచ్చారు. శుక్రవారం తెల్లవారే సమయానికి ఇంటి సమీపంలో ఆరుబైట కాలిన గాయాలతో మృతి చెంది ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతుడికి భార్య, ఉద్యోగం చేస్తున్న కుమారుడు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కృష్ణారావు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.