
దుర్గమ్మ సన్నిధిలో భక్తుల రద్దీ
ఆషాఢ సారె, శుక్రవారం నేపథ్యంలో కిటకిటలాడిన క్యూలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని అమ్మవారికి సారె సమర్పించేందుకు విచ్చేసే భక్త బృందాలతో పాటు శుక్రవారం అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో ఇంద్రకీలాద్రిపై పండుగ వాతావరణం నెలకొంది. తెల్లవారుజామున అమ్మవారికి నిర్వహించిన ఖడ్గ మాలార్చన, ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన పలు ఆర్జిత సేవల్లో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. ఉదయం 8 గంటల నుంచే ఆలయ ప్రాంగణంలోని అన్ని క్యూలు భక్తులతో కిటకిటలాడాయి. మరో వైపున అమ్మవారికి సారెను సమర్పించేందుకు పెద్ద ఎత్తున భక్తబృందాలు ఆలయానికి తరలివచ్చాయి. భక్తుల రద్దీ నేపథ్యంలో అమ్మవారి దర్శనానికి రెండు గంటల సమయం పట్టింది. ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు వీఐపీ దర్శనాలు నిలిపివేశారు. రూ. 300 టికెట్టుపై భక్తులకు బంగారు వాకిలి దర్శనం కల్పించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ అధికారులు క్యూలను పర్యవేక్షించారు. సాయంత్రం అమ్మవారికి నిర్వహించిన పంచహారతుల సేవ, పల్లకీ సేవల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

దుర్గమ్మ సన్నిధిలో భక్తుల రద్దీ