
ప్రాణనష్టం నివారణపై మెగా మాక్ డ్రిల్
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): రైలు ప్రమాదాల సమయంలో భద్రతా సిబ్బంది ప్రయాణికులను సురక్షితంగా కాపాడి, ప్రాణనష్టాన్ని నివారించే విషయంపై విజయవాడ డివిజన్‌లో ఎన్డీఆర్‌ఎఫ్, సివిల్ డిఫెన్స్, ఫైర్, రైల్వే బ్రేక్ డౌన్, స్టేట్ గవర్నమెంట్ ఎమెర్జెన్సీ రెస్పాన్స్ బృందాలు సంయుక్తంగా మెగా మాక్ డ్రిల్‌ను శుక్రవారం నిర్వహించాయి. దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ సేఫ్టీ ఆఫీసర్ (పీసీఎస్‌ఓ) కె.వెంకటరమణారెడ్డి, డీఆర్‌ఎం నరేంద్ర ఏ పాటిల్ పర్యవేక్షణలో ఫోన్‌మెన్ బంగ్లా వద్ద రైల్వే అప్‌యార్డ్ కాలనీలో మాక్ డ్రిల్ జరిగింది. ప్రమాదానికి గురైన రెండు రైల్వే కోచ్‌లు ఒకదానిపై ఒకటి వేలాడుతుండగా.. అందులోని ప్రయాణికులు రక్తపు గాయాల మధ్య ఆ ప్రాంతమంతా భయానక వాతావరణం ఉండే విధంగా నెలకొల్పారు. సకాలంలో ఘటనా స్థలానికి చేరుకున్న ఎన్డీఆర్‌ఎఫ్, రెస్క్యూ టీం, వైద్య బృందం, సివిల్ డిఫెన్స్ బృందాలు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టా యి. ఎన్డీఆర్‌ఎఫ్ బృందం రైల్వే కోచ్‌లలో ఇరు క్కుపోయిన ప్రయాణికులను సురక్షితంగా రక్షించేందుకు అత్యాధునిక టూల్స్ ఉపయోగించారు. రైల్వే కోచ్‌ల కిటికీలు, రూఫ్‌లు కట్ చేసి ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. వీరికి తక్షణ వైద్య సేవలు అందించేందుకు అక్కడే తాత్కాలికంగా ఏర్పాటు చేసిన టెంట్లలో వైద్యులు ప్రథమ చికిత్స చేసి అనంతరం అంబులెన్స్‌లో హాస్పిటల్‌కు తరలించారు. కొన్ని కోచ్‌లకు మంటలు వ్యాపించడంతో ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు.
సిబ్బందిని సంసిద్ధం చేసే నిరంతర చర్య
మాక్ డ్రిల్ అనంతరం పీసీఎస్‌ఓ కె. వెంకటరమణారెడ్డి మీడియాతో మాట్లాడారు. విపత్కర పరిస్థితుల్లో ఏ సమయంలో అయినా సిబ్బందిని సంసిద్ధత చేసే నిరంతర చర్య మాక్ డ్రిల్ అని పేర్కొన్నారు. మాక్ డ్రిల్స్ ద్వారా రియల్ టైమ్‌లో సిబ్బంది పనితీరు ప్రతిబింబిస్తుందని తెలిపారు. ప్రాణనష్టం నివారించే లక్ష్యంగా ఇటువంటి మాక్‌డ్రిల్స్ ఉపయోగపడతాయన్నారు. డీఆర్‌ఎం నరేంద్ర ఏ పాటిల్ మాట్లాడుతూ డివిజన్‌లో ఇటువంటి మాక్ డ్రిల్స్ సిబ్బందిలోని సమన్వయాన్ని మెరుగుపరుస్తుందన్నారు. కార్యక్రమంలో ఏడీఆర్‌ఎంలు పీ.ఈ.ఎడ్విన్, కొండా శ్రీనివాసరావు, పలు విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ప్రాణనష్టం నివారణపై మెగా మాక్ డ్రిల్