
జాతీయ రహదారిపై గుంతలు పూడ్చాలి
కేసరపల్లి(గన్నవరం): చైన్నె–కోల్‌కతా జాతీయ రహదారిపై గుంతలు పూడ్చి, రెండు వైపులా పచ్చదనం పెంపొందించాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ సంబంధిత అధికారులను ఆదేశించారు. స్థానిక అంత ర్జాతీయ విమానాశ్రయం నుంచి కేసరపల్లి వరకు జాతీయ రహదారిని ఆయన గురువారం పరిశీలించారు. విమానాశ్రయం నుంచి అమరావతికి నిత్యం వీవీఐపీలు, విదేశీ ప్రతినిధులు వస్తుంటారని, ఈ నేపథ్యంలో జాతీయ రహదారిని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దాలని సూచించారు. రహదారిపై ఏర్పడిన గుంతలు, బుడమేరు కాలువ వంతనపై పగుళ్లను తక్షణం పూడ్చి రాకపోకలకు అనువుగా మార్చాలని ఆదేశించారు. సెంట్రల్ డివైడర్‌పై వెలగని ఎల్‌ఈడీ లైట్ల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయాలని, రోడ్డుపైకి విస్తరించిన పొదలు, పిచ్చి మొక్కలను తక్షణం తొలగించి శుభ్రం చేయాలని, రోడ్డుకు రెండువైపులా పూల కుండీలను ఏర్పాటు చేసి పచ్చదనం పెంపొందించాలని పేర్కొన్నారు. అమరావతి అభివృద్ధి సంస్థ చైర్‌పర్సన్ లక్ష్మీపార్థ సారథి, ఎన్‌హెచ్‌ఏఐ పీడీ విద్యాసాగర్, తహసీల్దారు కె.వెంకటశివయ్య, ఎంపీడీఓ స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు.
జాతీయ రహదారిపై గుంతలను
పరిశీలిస్తున్న కలెక్టర్ బాలాజీ