
అన్యాయం చేశారు.. ఆదుకోండి
కృష్ణా జిల్లా కలెక్టర్‌ను వేడుకున్న గ్రామ వ్యవసాయ సహాయకులు
చిలకలపూడి(మచిలీపట్నం): ఇటీవల నిర్వహించిన బదిలీల్లో సుదూర ప్రాంతాలకు తమను బదిలీ చేసి అన్యాయం చేశారని సచివాలయాల్లో పనిచేస్తున్న గ్రామ వ్యవసాయ సహాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లా పాపలతో ఉన్న తమను వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాలకు బదిలీ చేయటం ఎంతో బాధ కలిగించిందన్నారు. కలెక్టర్ డీకే బాలాజీని గురువారం రాత్రి కలిసి తమ గోడును వెలిబుచ్చారు. సచివాలయా ల్లో ఐదేళ్లుగా పనిచేస్తున్న తమ వెసులుబాటు పట్టించుకోకుండా ఇష్టానుసారం బదిలీ చేశారని కలెక్టర్‌కు వివరించారు. అనారోగ్య సమస్యలు, స్పౌజ్ కేసులు, చంటి పిల్లలు ఉన్న తమను సుదూర ప్రాంతాలకు బదిలీ చేస్తూ ఎలా వెళ్లేదని విన్నవించారు.
వందల కిలోమీటర్ల దూరం..
జగ్గయ్యపేటలో పనిచేస్తున్న వారిని నాగాయలంకకు.. ఎ.కొండూరు నుంచి పమిడిముక్కల, మొవ్వ ప్రాంతాలకు బదిలీ చేయటంతో వందల కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోందన్నారు. తమకు వచ్చే జీతం చార్జీలకే సరిపోతుందని, జీవనం ఎలా గడుపుతామని కన్నీరు పెట్టుకున్నారు. రీకౌన్సెలింగ్ నిర్వహించి ర్యాంకుల ఆధారంగా బదిలీలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ వ్యవసాయశాఖ సంచాలకులను పిలిచి సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. వ్యవసాయశాఖ సంచాలకులు గ్రామ వ్యవసాయ సహాయకులతో మాట్లాడుతూ సమస్యలను పరిశీలించి పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని వారికి హామీనిచ్చారు.