
హత్య కేసులో నిందితుల అరెస్ట్
తిరువూరు: ఎ.కొండూరు మండలం పాతరేపూడి తండాలో గత నెల 26న కోట రాము అనే వ్యక్తిని హత్య చేసిన ఇరువురు నిందితులను గురువారం పోలీసులు అరెస్టు చేశారు. గురువారం తిరువూరు పోలీస్ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ ప్రసాదరావు తెలిపిన వివరాల ప్రకారం ఎ.కొండూరు మండలం తూర్పు మాధవరానికికు చెందిన ఆదూరి చార్లెస్‌కు, రెడ్డి గూడెం మండలం కూనపరాజు పర్వకు చెందిన బత్తు ల కుమారితో వివాహేతర సంబంధముంది. కొద్దికాలంగా కోట రాము కూడా కుమారిని తనతో వివా హేతర సంబంధం పెట్టుకోవాలని వేధిస్తున్నాడు.
అడ్డు తొలగించుకోవాలని..
కుమారి ఈ విషయాన్ని చార్లెస్‌కు చెప్పగా, ఇరువురూ కలసి రామును అడ్డు తొలగించుకోవాలని భావించారు. రామును కొత్త రేపూడి గ్రామశివారులోని మామిడి తోట వద్దకు కుమారి తీసుకురాగా, చార్లెస్ కర్రతో అతని తలపై బలంగా బాదాడు. రాము తలకు బలమైన గాయమై అక్కడికక్కడే చనిపోగా.. కుమారి, చార్లెస్ పరారయ్యారు. తన భర్త మూడు రోజులుగా కనిపించట్లేదని హతుడి భార్య వెంకటేశ్వరమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా, 29న పాత రేపూడి మామిడితోటలో లభ్యమైన మృతదేహం రాముదిగా గుర్తించినట్లు ఏసీపీ తెలిపారు. కుమారి, చార్లెస్‌పై వెంకటేశ్వరమ్మ అనుమానం వ్యక్తం చేయగా.. వారిని విచారించగా నేరం అంగీకరించినట్లు వివరించారు. నిందితులను అరెస్టు చేసి తిరువూరు కోర్టులో హాజరుపరచగా, మేజిస్ట్రేట్ రిమాండుకు ఆదేశించారని తెలిపారు. తిరువూరు సీఐ గిరిబాబు, ఎ.కొండూరు ఎస్‌ఐ కృష్ణ పాల్గొన్నారు.