
కొనసాగుతున్న సారె సంబరం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఆషాఢ మాసోత్సవాలను పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు భక్తులు సారె సమర్పిస్తున్నారు. మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఇంద్రకీలాద్రికి తరలివస్తున్న భక్త బృందాలతో ఆలయ ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది. ప్రధాన ఆలయంలోని మూలవిరాట్‌ను దర్శించుకుని తమ కుటుంబం పిల్లాపాపలతో సంతోషంగా ఉండేలా దీవించమని అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. మహా మండపం ఆరో అంతస్తులో ఉత్సవ మూర్తికి తాము సారెగా తీసుకువచ్చిన చీరలు, పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, మిఠాయిలను సమర్పిస్తున్నారు. సారె తీసుకువచ్చిన భక్త బృందాలకు ఆలయ అర్చకులు వేదాశీర్వచనం అందిస్తున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో భక్త బృందాలు సారెను అమ్మవారి ప్రసాదంగా భక్తులకు అందిస్తూ సంతోషాలను పంచుకుంటున్నారు. అమ్మవారికి సారె సమర్పించేందుకు విచ్చేసిన భక్త బృందాలకు దేవస్థానం ఉచిత ప్రసాదంతో పాటు అన్న ప్రసాదాలను అందజేస్తోంది. అమ్మవారికి సారె సమర్పించేందుకు విచ్చేసే భక్తులకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడాలని ఈవో శీనానాయక్ అన్ని విభాగాల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
దుర్గగుడికి తరలివస్తున్న భక్తబృందాలు

కొనసాగుతున్న సారె సంబరం