
పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు
చిలకలపూడి(మచిలీపట్నం): కూటమి ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థను, స్థానికసంస్థలను నిర్వీ ర్యం చేస్తోందని వైఎస్సార్ సీపీ పంచాయతీరాజ్ విభాగం జిల్లా అధ్యక్షుడు సింహాద్రి వెంకటేశ్వరరావు అన్నారు. ఈ మేరకు కలెక్టర్ డీకే బాలాజీకి సోమవారం మీకోసం కార్యక్రమంలో వినతిపత్రం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులను సైతం దారి మళ్లిస్తూ స్థానిక ప్రజాప్రతినిధులను అగౌరవపరుస్తూ చట్టాలను తుంగలోకి తొక్కుతున్నారన్నారు. ఉపాధి హామీ పథకాన్ని టీడీపీ నేతలు జేబు నింపుకొనే సంస్థగా మార్చుకున్నారన్నారు. జిల్లాలో ఉపాధి హామీ పధకంలో జరుగుతున్న అవినీతిపై తక్షణమే న్యాయవిచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఉపాధి పనులను గ్రామ పంచాయతీల ద్వారానే జరిపించాలని, కూలీలకు సకాలంలో వేతనాలు చెల్లించాలని కోరారు. సర్పంచులకు తల్లికి వందనం పథకాన్ని వర్తింపజేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘ నిధులను స్థానిక సంస్థలకు వెంటనే జమ చేయాలన్నారు. బిల్లుల చెల్లింపులో రాజకీయ జోక్యాన్ని నివారించాలన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 73, 74 సవరణల మేరకు సర్పంచులకు ఉన్న అధికారులను అమలు చేయాలని, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు గౌరవ వేతనాలు పెంపుదల చేయాలని, పెండింగ్ గౌరవ వేతనాలను వెంటనే చెల్లించాలన్నారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర కార్యదర్శి నామా వెంకటేశ్వరరావు, జెడ్పీటీసీ సభ్యుడు సీహెచ్ లక్ష్మీనారాయణ, ఆర్.కళ్యాణి, వైఎస్సార్ సీపీ నాయకులు ఎ.సత్యనారాయణ, డి.విజయకుమార్, కె.నాగరాజు, ఆర్.ప్రసాద్ తదితరులు ఉన్నారు.
వైఎస్సార్ సీపీ పంచాయతీరాజ్ విభాగం
జిల్లా అధ్యక్షుడు సింహాద్రి వెంకటేశ్వరరావు