కంకిపాడు: విద్యాశాఖను గాడిలో పెట్టేందుకు ఆ శాఖ ముఖ్య కార్యదర్శి క్షేత్రస్థాయి పర్యటన చేపట్టారు. ఆకస్మిక తనిఖీ ద్వారా వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేయనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా విద్యాశాఖ యంత్రాంగం అప్రమత్తమైంది. ఏ పాఠశాలను సందర్శిస్తారో అన్న నెలకొంది. విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ ఏప్రిల్ 1న కృష్ణా జిల్లాలో పర్యటించేందుకు షెడ్యూల్ ఖరారు చేశారు. జిల్లాలను పర్యటిస్తూ అక్కడి పరిస్థితులను అధ్యయనం చేస్తున్నారు. ఇటీవలే విశాఖలో పాఠశాలల నిర్వహణ, సిబ్బంది నడుమ సమన్వయ లోపం, పర్యవేక్షణ లోపాలను గుర్తించి సీరియస్ క్లాస్ తీసుకున్నారు. ఇటీవల కంకిపాడు మండలంలోని ఓ పాఠశాలను సందర్శించి నోట్ బుక్స్, వర్క్‌బుక్స్ నిర్వహణపై ఉపాధ్యాయులపై అసహనం వ్యక్తం చేశారు. అంతేకాకుండా చార్జ్‌మెమోలు జారీ చేశారు. ఏప్రిల్ 1న జిల్లా పర్యటనకు వస్తున్న సందర్భంలో విద్యాశాఖను టెన్షన్ చుట్టుముట్టింది. అప్రమత్తమైన అధికారులు జిల్లాలోని అన్ని పాఠశాలలకు సూచనలు జారీ చేశారు. రికార్డులు, రిజిస్టర్లు అప్‌డేట్ చేసుకోవాలని, ఎఫ్‌ఏ 4 మార్కులు జాబితాలను అప్‌లోడ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు సంబంధిత ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు చర్యలు చేపట్టారు.