
పర్యావరణ పరిరక్షణతోనే మనుగడ
ఆసిఫాబాద్‌రూరల్: పర్యావరణ పరిరక్షణతో నే మానవ మనుగడ అని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో బుధవారం సంబంధిత శాఖల అధికారులతో కలిసి నేషనల్ స్టూడెంట్ పర్యావరణ్ కాంపిటేషన్ పోస్టర్లు ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ హరిత్– ది వే ఆఫ్ లైఫ్ అనే నినాదంతో జూలై 1 నుంచి ఆగస్టు 21 వరకు దేశవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు, యువత అధిక సంఖ్యలో పోటీల్లో పాల్గొనేలా చూడాలన్నారు. ఇందులో భాగంగా మొక్కలు నాటడం, చెత్త వేరు చేయడం, నీటి సంరక్షణ తదితర అంశాలు చేపట్టాల్సి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో హరిత దళం కోఆర్డినేటర్ కుటుకం మధుకర్, డీఆర్‌డీవో దత్తారావు, వయోజన విద్యాశాఖ అసిస్టెంట్ ప్రాజెక్టు అధికారి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
మహిళలను అక్షరాస్యులుగా
తీర్చిదిద్దాలి
ఆసిఫాబాద్‌రూరల్: జిల్లాలో నిరక్షరాసులైన మహిళలను గుర్తించి అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో బుధవారం సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా ప్రతీ మహిళ చదువుకునేలా కృషి చేయాలన్నారు. జిల్లాలో 22,494 మంది అక్షరాస్యత లేని మహిళలను గుర్తించామని తెలిపారు. వీరిని అక్షరాస్యులుగా మార్చడంలో భాగంగా సెర్ప్ సిబ్బంది, ఆపరేటర్లు ప్రతీ ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరించాలని ఆదేశించారు. ఇప్పటివరకు 10,227 మంది అభ్యాసకులు, 1,037 మంది వలంటీర్లను ఎంపిక చేశామని పేర్కొన్నారు. ఉల్లాస్ యాప్ ద్వారా వివరాల నమోదు త్వరగా పూర్తిచేయాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్‌డీవో దత్తారావు, రిసోర్స్ పర్సన్లు మోహన్, తుకారాం తదితరులు పాల్గొన్నారు.