ఖమ్మం లీగల్: ఖమ్మం బార్ అసోసియేషన్ ఎన్నికలు గురువారం జరగనుండా ప్రచారం ఉధృతంగా సాగుతోంది. బరిలో నిలిచిన అభ్యర్థులు తమ విజయాన్ని కాంక్షిస్తూ న్యాయవాదులను వ్యక్తిగతంగా కలవడమే వాట్సాప్ ద్వారా మెసేజ్‌లు పంపిస్తున్నారు. ఇంకొందరు సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికల్లో యువ, మహిళా న్యాయవాదుల ఓట్లు కీలకం కానున్నట్లు తెలుస్తోంది. బార్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి ఎస్.వెంకటగుప్తా, తొండపు వెంకటేశ్వరరావు, విజయ రాఘవ, ఉపాధ్యక్ష పదవికి ఎస్.కే.జానీమియా, విజయశాంత, రవిప్రసాద్, ప్రధాన కార్యదర్శి పదవికి గద్దల దిలీప్, తెల్లాకుల రమేష్‌బాబు, క్రీడా కార్యదర్శి పదవికి కే.వీ.వీ.లక్ష్మి, రాందాస్‌నాయక్, గ్రంథాలయ కార్యదర్శిగా కళ్యాణి, రాంబాబు పోటీ పడుతున్నారు. ఇక సంయుక్త కార్యదర్శి, కోశాధికారిగా మేకల నవీన్, నరసింహారావు, మహిళా ప్రతినిధిగా ఇందిర ఇప్పటికే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాగా, ఎన్నికల గడువు సమీపిస్తుండడంతో అభ్యర్థులు ప్రచారంలో జోరు పెంచారు. మొత్తం 816 మంది న్యాయవాదులు ఓటు హక్కు వినియోగించుకోనుండగా విజయం వరిస్తుందోనన్న ఉత్కంఠ నెలకొంది.