
బావిలోకి పడ్డ నక్క
గౌరిబిదనూరు: తాలూకా కడబూరు సమీపంలో రామకృష్ణారెడ్డి పొలంలోని బావిలోకి గురువారం రాత్రి ఓ నక్క పడిపోయింది. శుక్రవారం ఉదయం పొలానికి వెళ్లిన రైతు నక్కను చూసి అటవీశాఖ అధికారులకు తెలిపారు. అటవీ సిబ్బంది వచ్చి నక్కను తీసుకెళ్లి సురక్షిత ప్రదేశంలో వదిలిపెట్టారు.
భార్య దెబ్బలకు భర్త హతం
● బెంగళూరులో ఘటన
దొడ్డబళ్లాపురం: భార్యల చేతుల్లో భర్తలు హతమవుతున్న సంఘటనలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. తాజాగా బెంగళూరు సుద్దగుంట పోలీస్‌స్టేషన్ పరిధిలో భార్య భర్తను బలితీసుకుంది. భాస్కర్ (40).. భార్య శృతి చేతిలో ప్రాణాలు కోల్పోయాడు. ఇంటి పనిమనిషితో భర్త చనువుగా ఉంటున్నాడని శృతి అప్పుడప్పుడు గొడవ చేసేది. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి తీవ్ర రగడ జరిగింది. శృతి చేతికి దొరికిన వస్తువుతో దాడి చేసింది, తలకు దెబ్బ తగిలిన భాస్కర్ అక్కడికక్కడే చనిపోయాడు. దీంతో ఆందోళనచెందిన శృతి భర్త శవానికి స్నానం చేయించి ఏమీ జరగనట్లు బెడ్ మీద పడుకోబెట్టింది. బాత్‌రూంలో పడి చనిపోయాడని చుట్టుపక్కల వాళ్లను నమ్మించింది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిర్వహించగా గాయాలు బయటపడ్డాయి. దీంతో శృతిని అదుపులోకి తీసుకుని విచారించగా, నిజం వెల్లడించింది. కేసు నమోదు చేసి ఆమెను అరెస్టు చేశారు.
సీఎం మార్పు వారి
వ్యవహారం: కుమార
మండ్య: ముఖ్యమంత్రిని మారుస్తారా... వేరేవారు ముఖ్యమంత్రి అవుతారా అనే విషయం నాకు అనవసరం. అదంతా కాంగ్రెస్ వ్యవహారం, నేను తల బద్ధలు కొట్టుకోవాల్సిన పని లేదు అని కేంద్రమంత్రి హెచ్‌డీ కుమారస్వామి అన్నారు. శుక్రవారం మండ్య నగరంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా సీఎం మార్పు జరుగుతుందని వస్తున్న వార్తలతో తనకు సంబంధం లేదన్నారు. జేడీఎస్ యువజన విభాగం అధ్యక్షుడు నిఖిల్ త్వరలో రాష్ట్రమంతటా పర్యటిస్తారని చెప్పారు. వచ్చే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో జేడీఎస్, బీజేపీ ఎన్ని సీట్లలో పోటీ చేయాలి అనేది హైకమాండ్లు చర్చించి నిర్ణయం తీసుకుంటాయన్నారు.
గంగమ్మకు బిస్కెట్ల శోభ
చింతామణి: పట్టణం వెలసిన శ్రీ గంగాభవాని అమ్మవారికి ఆషాడ మాస రెండవ శుక్రవారం సందర్భంగా బిస్కెట్లతో వినూత్నంగా అలంకరించారు. అర్చకులు సురేష్ ఉదయమే అమ్మవారికి అభిషేకం, అలంకారం జరిపి, విశేష పూజలను నిర్వహించారు. పెద్దసంఖ్యలో మహిళా భక్తులు దర్శించి తరించారు.

బావిలోకి పడ్డ నక్క