
రాత్రంతా కావేరి నదిలో చిక్కి..
మండ్య: భూమి మీద నూకలు మిగిలి ఉంటే ఎంత ఆపద వచ్చినా ప్రాణాలు పోవంటారు. అలాంటిదే ఈ సంఘటన. ఆత్మహత్య చేసుకోవడానికి కావేరి నదిలోకి దూకిన యువతి ఒకరు ప్రవాహంలో ఉన్న చెట్టుకు చిక్కుకొని రాత్రి మొత్తం కొట్టుమిట్టాడింది. చివరకు ప్రజలు, పోలీసులు ఆమెను కాపాడి బయటకు తీసుకొచ్చారు. ఈ ఆశ్చర్యకర సంఘటన మండ్య జిల్లాలోని శ్రీరంగ పట్టణం తాలూకాలోని మహాదేవపుర గ్రామంలో జరిగింది.
ఇంట్లో గొడవపడి
వివరాలు.. బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీలో నివసించే పవిత్ర (19), ఓ కాలేజీలో ఎల్‌ఎల్‌బీ చదువుతోంది. గురువారం సాయంత్రం కుటుంబ సభ్యులతో ఏదో గొడవ జరిగింది. ఇంటి నుంచి బయటికి వచ్చి మైసూరులో ఉన్న బంధువుల ఇంటికని బయల్దేరింది. అయితే శ్రీరంగపట్టణానికి వచ్చి మహాదేవపుర గ్రామానికి వెళ్లింది. అక్కడ వంతెన పై నుంచి ఉధృతంగా ప్రవహిస్తున్న కావేరి నదిలోకి దూకింది. ప్రవాహంలో చాలా దూరం కొట్టుకొని వెళ్ళి ఓ చోట చెట్టుకు చిక్కుకుంది. రాత్రంతా అలాగే ఉండిపోయింది. శుక్రవారం తెల్లవారుజామున ఆమెను చూసిన ప్రజలు వెంటనే అరికెరె పోలీసులకు, ఫైర్ సిబ్బందికి తెలిపారు. నది మధ్యలో చెట్టుకు చిక్కిన పవిత్రను కాపాడి ఆస్పత్రిలో చేర్పించి ఆమె కుటుంబానికి సమాచారమిచ్చారు.
ఆత్మహత్యాయత్నం చేసిన యువతి
అనూహ్యంగా బయటపడిన వైనం