విదేశీ పండ్లకు భలే గిరాకీ | - | Sakshi
Sakshi News home page

విదేశీ పండ్లకు భలే గిరాకీ

Jul 4 2025 6:43 AM | Updated on Jul 4 2025 6:43 AM

విదేశ

విదేశీ పండ్లకు భలే గిరాకీ

సాక్షి, బళ్లారి: మారుతున్న కాలానుగుణంగా శాస్త్ర సాంకేతిక రంగం కొత్త పుంతలు తొక్కుతున్న తరుణంలో రోజురోజుకు అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మామూలుగా మన ప్రాంతాల్లో మామిడి, బొప్పాయి, అరటి, జామ, సపోట, ఖర్బూజ, యాపిల్‌, ఆరెంజ్‌, దానిమ్మ, మోసంబి తదితర పండ్ల తోటలను రైతులు అష్టకష్టాలతో పండిస్తుంటారు. ఆ పండ్ల తోటలను పండిన రైతులకు కూడా గిట్టుబాటు ధర లేక చాలా మంది పండ్ల తోటల పెంపకంపై నిరాసక్తత చూపుతున్న సందర్భాలు కోకొల్లలు. అయితే ఏటేటా విదేశాల్లో పండుతున్న పండ్లను మన ప్రాంతాల్లో కూడా పండిస్తూ రైతులు అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఇక్కడ భూమి అనువైనది కాదని రైతులు అనుకొనేవారు. అయితే కర్ణాటకలోని ఉమ్మడి బళ్లారి జిల్లాతో పాటు రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో విదేశీ పండ్ల తోటల పెంపకాన్ని విరివిగా చేపడుతున్నారు.

విదేశీ పండ్లతో ఆరోగ్యానికి మేలు

విదేశీ పండ్లను తినడం ద్వారా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేకూరుస్తుందని చెబుతుండటంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 200లకు పైగా వివిధ రకాల పండ్ల తోటలను పెంచుతున్నారు. మెక్సికో దేశం నుంచి డ్రాగన్‌ ప్రూట్స్‌, మలేషియా నుంచి రంభుటాన్‌, దురియన్‌ పండ్ల తోటలు రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో విస్తృతంగా సాగు చేస్తున్నారు. ఉమ్మడి బళ్లారి జిల్లాలో విజయనగర, బళ్లారి ప్రాంతాల్లో డ్రాగన్‌ ప్రూట్‌ ఏటేటా సాగు విస్తీర్ణం పెరుగుతోంది. డ్రాగన్‌ప్రూట్‌కు మార్కెట్లో కూడా మంచి డిమాండ్‌ ఉంది. దక్షిణ కన్నడ జిల్లాలో రంభుటాన్‌ పండ్ల తోటలను అధికంగా పండిస్తున్నారు. కాఫీ తోటలకు పేరు గాంచిన హాసన, శివమొగ్గ జిల్లాల్లో కూడా బటర్‌ప్రూట్స్‌ తోటలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గత కొన్నేళ్లుగా విదేశీ పండ్ల తోటలను విస్తృతంగా సాగు చేస్తుండటంతో వినియోగదారులు కూడా వాటిని కొనుగోలు చేస్తూ రైతులకు తోడ్పాటును అందిస్తున్నారు.

వివిధ జిల్లాల్లో సాగు వివరాలు

హగరిబొమ్మనహళ్లి తాలూకాలో డ్రాగన్‌ ప్రూట్స్‌ను, దక్షిణ కన్నడ జిల్లాలో వక్క, టెంకాయ తోటల మధ్యన రంభుటాన్‌, మ్యాంగోస్టిన్‌ పండ్ల తోటలను అధికంగా సాగు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో దాదాపు 12 వేల ఎకరాల్లో విదేశీ పండ్ల తోటలను సాగు చేసినట్లు ఉద్యానవన శాఖ అధికారులు పేర్కొన్నారు. డ్రాగన్‌, అవకాడొ ఎక్కువగా సాగు చేయగా స్ట్రాబెర్రీ, నకడెమియా తదితర విదేశీ పండ్లు కూడా వందలాది ఎకరాల్లో కనిపిస్తున్నాయి. డ్రాగన్‌ ప్రూట్స్‌ బళ్లారి, విజయనగర, చామరాజ నగర్‌, బీదర్‌ తదితర జిల్లాల్లో పెద్ద ఎత్తున సాగు చేస్తున్నారు. డ్రాగన్‌ ప్రూట్స్‌తో రైతులకు మంచి లాభాలు వస్తున్నాయి. ఈ పండ్ల తోటల పెంపకం ద్వారా రైతులు కొత్త కొత్త పంటలను సాగు చేయడంపై అనుభవం పెంచుకొంటున్నారు. ఎంతో రుచి, ఆరోగ్యం, చూసేందుకు కనువిందుగా కనిపించే విదేశీ పండ్లు మార్కెట్లో విస్తృతంగా కనిపిస్తున్నాయంటే ఇక్కడి రైతులు కూడా సాగు చేయడంతో ఎప్పటికప్పుడు మార్కెట్లో లభ్యమవుతున్నాయని పండ్ల అమ్మకందారులు పేర్కొన్నారు.

తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం

దక్షిణ కన్నడ, ఉడిపిలో విస్తృతంగా పండించే రంభుటాన్‌ పండ్లకు మార్కెట్లో మంచి డిమాండ్‌ ఉంది. ఈ జిల్లాల్లో 155 ఎకరాల్లో సాగు చేశారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను రైతులు అర్జిస్తున్నారు. అవకాడొ పండ్లను రాష్ట్రంలో ఉత్తర కర్ణాటక ప్రాంతంలోని గదగ్‌, హావేరి జిల్లాలతో పాటు మైసూరు జిల్లాలో కూడా విరివిగా సాగు చేస్తున్నారు. ఈ పండ్ల తోటల పెంపకం రైతులను ఆర్థికంగా నిలుదొక్కుకునేందుకు దోహదం చేస్తున్నాయి. రైతులు ఉత్సాహంతో విదేశాల్లో పండించే పండ్లను సైతం ఇక్కడ పండిస్తున్నప్పటికీ సరైన మార్గదర్శనం, పరిశోధనలు లేకపోవడంతో రైతులు నష్టాలను కూడా చవిచూస్తున్నారు. అయితే రంభుటాన్‌, లిచ్చి తదితర పండ్లకు రోజు రోజుకు మంచి గిరాకీ లభిస్తోందని రైతులు అంటున్నారు. మన దేశంలో పండించే పండ్లతో పాటు విదేశాల్లో పండించే పండ్లకు మంచి గిరాకీ వస్తుండటంతో రైతులు వాటిని సాగు చేసేందుకు ఏటా ఆసక్తిని పెంచుకొంటున్నారు. కొడగు జిల్లాలో జర్ముప్లాసంను కూడా సాగు చేస్తున్నారు. ఇలా రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో విదేశీ పండ్ల తోటల సాగు ఎక్కువగా కనిపిస్తోందని చెప్పవచ్చు.

పండ్ల తోటల పెంపకంపై రైతుల ఆసక్తి

వివిధ దేశాల పండ్లు కర్ణాటకలో లభ్యం

విదేశీ పండ్లకు భలే గిరాకీ1
1/4

విదేశీ పండ్లకు భలే గిరాకీ

విదేశీ పండ్లకు భలే గిరాకీ2
2/4

విదేశీ పండ్లకు భలే గిరాకీ

విదేశీ పండ్లకు భలే గిరాకీ3
3/4

విదేశీ పండ్లకు భలే గిరాకీ

విదేశీ పండ్లకు భలే గిరాకీ4
4/4

విదేశీ పండ్లకు భలే గిరాకీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement