
బీదర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి,బళ్లారి/రాయచూరు రూరల్: బీదర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గూడ్స్ వాహనం బావిలోకి బోల్తా పడటంతో అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు మృతి చెందగా, నలుగురికి గాయాలయ్యాయి. బీదర్ తాలూకా గోడంపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గూడ్స్ వాహనం ఉన్నఫళంగా బావిలోకి బోల్తా పడింది. గూడ్స్ వాహనంలో ప్రయాణిస్తున్న గోడంపల్లికి చెందిన లక్ష్మీకాంత్ అలియాస్ కాంత మహారాజు(45), రవి(18) అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో అర్జున్, ప్రజ్వల్, పవన్, సంగమేష్ అనే నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన సమాచారం తెలిసిన వెంటనే అక్కడి పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. బావిలో పడిపోయిన వాహనం కింద పడి మృతి చెందిన ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. వివరాలు సేకరించి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని బీదర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై అక్కడి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా రోడ్డు ప్రమాదంలో కుమారుడు మృతి చెందాడని తెలియగానే తల్లి గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందింది.
మరణంలోనూ వీడని తల్లీకుమారుడి బంధం
బీదర్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బావిలోకి గూడ్స్ వాహనం బోల్తా పడిన నేపథ్యంలో అందులో ప్రయాణిస్తున్న రవి(18) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలిసిన వెంటనే అదే గోడంపల్లి గ్రామానికి చెందిన శారదాబాయి(70) అనే మహిళ తన కుమారుడు మృత్యువాత పడ్డాడని తెలిసి, బాధ భరించలేక కన్నీరుమున్నీరుగా విలపిస్తూ గుండెపోటుతో మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఒకే రోజు తల్లీ, కుమారుడు కూడా మృతి చెందడంతో మరణంలో కూడా వారి బంధం వీడలేదని స్థానికులు కన్నీరు పెట్టుకున్నారు.
బావిలో బోల్తా పడిన గూడ్స్ వాహనం
ఇద్దరు మృతి, నలుగురికి తీవ్ర గాయాలు

బీదర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం