
గడువుకు ముందే తుంగభద్ర తుళ్లింత
సాక్షి, బళ్లారి/హొసపేటె: కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు తాగు, సాగునీరందించే తుంగభద్ర జలాశయంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో డ్యాం క్రస్ట్‌గేట్లలో ఆరు క్రస్ట్‌గేట్లు పైకెత్తి నదికి సుమారు 14,136 క్యూసెక్కుల నీరు వదిలారు. బుధవారం తుంగభద్ర బోర్డు ఉన్నతాధికారి ఓఆర్‌కే రెడ్డి, ఎస్‌ఈ నారాయణనాయక్, ఎస్‌డీఓ జ్ఞానేశ్వర్ తదితరులు క్రస్ట్‌గేట్లకు పూజలు చేసి నదికి నీరు వదిలారు. డ్యాం ప్రస్తుత గరిష్టనీటి నిల్వ సామర్థ్యం 100 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 80 టీఎంసీలకు కుదించేశారు. ఈ నేపథ్యంలో గతంలో ఎన్నడూ లేని విధంగా జూలై మొదటి వారం వచ్చేలోపు 80 టీంఎంసీలు నీరు చేరడంతో పాటు డ్యాం ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రస్తుతం డ్యాంలోకి ఇన్‌ఫ్లో కూడా 30 వేల క్యూసెక్కులు వచ్చి చేరుతుండటంతో ముందుస్తు చర్యలతో డ్యాం క్రస్ట్‌గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదిలి ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. డ్యాంలో 77.144 టీఎంసీల నీరు నిల్వ ఉంచి మిగిలిన నీటిని నది ద్వారా కిందకు వదిలే విధంగా గేట్లను ఎత్తారు.
మరమ్మతుల్లో లోపం.. రైతులకు శాపం
గత ఏడాది 19వ క్రస్ట్‌గేటు కొట్టుకుపోయినప్పుడు తాత్కాలికంగా స్టాప్‌లాగ్ గేటును అమర్చి ఖరీఫ్‌తో పాటు రబీకి కూడా నీరందించారు. అయితే డ్యాంకు ఉన్న 33 గేట్లను మరమ్మతులు చేయాలని నిపుణుల కమిటీ సూచించింది. అయినా పాలకులు సరైన నిర్ణయం తీసుకోకపోవడంతో రైతులకు శాపంగా మారింది. రబీలో కాలువలకు నీరు నిలుపుదల చేసిన తర్వాత క్రస్ట్‌గేట్లను మరమ్మతు చేసే విషయంలో కర్ణాటక, ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు మీనమేషాలు లెక్కించడంతో ఈ ఏడాది డ్యాంలో 100 టీఎంసీల నుంచి 80 టీఎంసీలకు కుదించే పరిస్థితి ఏర్పడిందని రైతులు విమర్శిస్తున్నారు. డ్యాం క్రస్ట్‌గేట్లను మరమ్మతు చేసే విషయంలో వేగవంతంగా నిర్ణయాలు తీసుకుని, నిధులు విడుదల చేసి, పనులు పూర్తి చేసి ఉంటే 80 టీఎంసీలకు చేరుకున్న తర్వాత వదిలే అవకాశం ఉండేది కాదని చెప్పవచ్చు. ఈ ఏడాది ఖరీఫ్ పంటకు నీరు ఎలాంటి ఢోకా లేకపోయినా రబీ పంటపై స్పష్టత కనిపించక పోవడంతో ఆయకట్టు రైతుల్లో ఈసారి ఒకే పంటపైనే ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం డ్యాంకు ఎగువ నుంచి వరద కొనసాగుతుండటంతో అదనపు నీటిని దిగువకు వదిలే అవకాశం ఉంది. ప్రస్తుతం డ్యాంలో నీటిమట్టం 1625.20 అడుగులు, ఇన్‌ఫ్లో 32,767 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 13,670 క్యూసెక్కులుగా ఉందని బోర్డు అధికార వర్గాలు తెలిపారు.
జలాశయం వద్ద ఆరు క్రస్ట్‌గేట్లు
ఎత్తి నీరు విడుదల
డ్యాంలో గరిష్ట నీటి నిల్వను
80 టీఎంసీలకు కుదించిన వైనం
క్రస్ట్‌గేట్లు బలంగా లేనందున
ముందుగానే గేట్ల ఎత్తివేత
డ్యాం చరిత్రలో జూలై 2 నాటికి గేట్లు ఎత్తడం ఇదే తొలిసారి

గడువుకు ముందే తుంగభద్ర తుళ్లింత