
సర్కారు బడులు అభివృద్ధి కావాలి
బళ్లారి అర్బన్: ప్రభుత్వ పాఠశాలలు కొనసాగి, అభివృద్ధి చెందాలి, అలాగే ఇరుగు పొరుగు గ్రామాల్లో కూడా సమాన పాఠశాలలు అభివృద్ధి చెందాలని రాష్ట్ర పాఠశాలల అభివృద్ధి, పర్యవేక్షణ సమితుల సమన్వయ వేదిక నేతలు వీపీ నిరంజనారాధ్య, జేవీ మంజునాథ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పాఠశాలల అభివృద్ధికి వారు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ముఖ్యంగా విద్యా హక్కు చట్టం–2009ను పూర్తిగా పరిణామాత్మకంగా అమలు చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి. ఈ ప్రణాళిక అమలుకు ప్రభుత్వం అవసరమైన నిధులు కేటాయించాలన్నారు. నర్సరీ నుంచే ఇంగ్లిష్ మీడియం అమలుకు స్వస్తి చెప్పి విద్యా హక్కు చట్టం ప్రకారం కనీసం 8వ తరగతి వరకు మాతృభాషలోనే బోధించాలన్నారు. త్రిభాష సూత్రానికి బదులు ద్విభాష సూత్రాన్ని అమలు చేయాలి. ఆంగ్ల భాషను ఓ భాషగా ప్రభుత్వ స్థాయిలో బోధించడానికి నిపుణులైన ఆంగ్ల భాష ఉపాధ్యాయులను నియమించాలి. భాషను పరిణామాత్మకంగా బోధించడానికి అవసరమైన వనరులు అలాగే శిక్షణ ఇవ్వాలన్నారు. కన్నడను పాలన భాషగా మరింత పరిణామాత్మకంగా అమలు చేయడానికి ప్రభుత్వ పాఠశాల, కళాశాలల్లో చదివిన విద్యార్థులకే ప్రభుత్వ ఉద్యోగాలు, రిజర్వేషన్లు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. అలాగే మొత్తం 15 డిమాండ్లను ప్రభుత్వానికి నివేదించినట్లు వారు తెలిపారు.