
ఇప్పటివరకు 1,500 కు పైగా అబార్షన్లు చేసినట్లు అంచనా
కడుపులోనే
బనశంకరి: గర్భస్థ పిండం లింగ నిర్ధారణ, ఆడపిల్ల అయితే అబార్షన్ చేసే కిరాతక ముఠా ఆగడాలు క్రమంగా బయటపడుతున్నాయి. ఈ ముఠా బెంగళూరుతో సహా రాష్ట్రంలో 1,500 కు పైగా భ్రూణ హత్యలకు పాల్పడినట్లు, గత మూడునెలల్లో ఎక్కువగా సుమారు 242 అబార్షన్లు చేయించినట్లు పోలీసుల దర్యాప్తులో వెలుగుచూసింది. లింగ నిర్ధారణ చేసేది ఒక ముఠా అయితే, అబార్షన్ నిర్వహించేది మరో ముఠాగా తేలింది. క్రైం సినిమాలో మాదిరిగా ఈ ముఠాలు కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. పోలీసులు వీరి ఫోన్ కాల్స్ వివరాలు సేకరిస్తుండగా, సమాజంలోని ప్రముఖ డాక్టర్లతో పాటు అనేక మంది పలుకుబడి ఉన్నవారి సంబంధాలు ఉన్నట్లు తేలింది. వారికి పోలీసులు ఫోన్లు చేస్తే కొందరు స్పందించడం లేదని బెంగళూరు పోలీస్ కమిషనర్ బీ.దయానంద్ తెలిపారు. చైన్నెకు చెందిన డాక్టర్ తులసిరామ్, మైసూరు ప్రైవేటు ఆసుపత్రి డాక్టర్ చందన్‌బల్లాల్, అతని భార్య మీనా, ఆస్పత్రి రిసెప్షనిస్ట్ రిజ్మా, ల్యాబ్ టెక్నీషియన్ నిస్సార్ అనేవారిని అరెస్ట్ చేశారు. రెండురోజుల క్రితం మైసూరు ఉదయగిరి ప్రైవేటు ఆసుపత్రి, రాజ్‌కుమార్ రోడ్డులోని ఆయుర్వేదిక్ డే కేర్ సెంటర్‌ను సీజ్ చేశారు. ఈ రెండింటిని దందాకు ఉపయోగించేవారని గుర్తించారు.
మైసూరు, బెంగళూరులో వ్యవహారం
అక్రమ అబార్షన్ల కుంభకోణంలో ఇప్పటివరకు 9 మందిని అరెస్ట్ చేశామని, పట్టుబడిన వారందరూ మైసూరు, మండ్య, చైన్నెకి చెందినవారని కమిషనర్ తెలిపారు. మండ్య అలెమనె, మైసూరు, బెంగళూరులోని బైయప్పనహళ్లి ఆసుపత్రుల్లో గర్భిణులకు లింగ నిర్ధారణ పరీక్షలు, అబార్షన్లకు పాల్పడేవారు. ఇందులో మధ్యవర్తులు కూడా పెద్దసంఖ్యలో ఉన్నారు. వారి ద్వారా బాధిత మహిళల వివరాలను సేకరిస్తున్నారు. ఒక గర్భవిచ్ఛిత్తికి రూ.20 వేలకుపైగా తీసుకునేవారు. గత మూడునెలల్లో 242 అబార్షన్లు చేసి కోట్లాది రూపాయలు సంపాదించారు. ఈ ముఠా గురించి బైయప్పనహళ్లి పోలీసులు గత అక్టోబరులో శివనంజేగౌడ, వీరేశ్, నవీన్‌కుమార్, నయన్‌కుమార్ అనే నిందితులను అరెస్ట్‌చేశారు. మగపిల్లలు మాత్రమే కావాలనుకునేవారు, ఇతరత్రా కారణాలతో గర్భం వద్దనుకునే మహిళలను, యువతులను ఈ ముఠా గాలించేది. మధ్యవర్తులు కూడా తీసుకొచ్చేవారు. వారికి మండ్యలో స్కాన్ చేయించి గర్భ విచ్ఛిత్తికి పాల్పడుతున్నట్లు పోలీసులు దర్యాప్తులో వెల్లడైంది.
వందలాది గర్భస్థ
పిండాల హత్య
రాష్ట్రంలో బృహత్ అబార్షన్
ముఠా గుట్టురట్టు
లింగ నిర్ధారణ చేసి, ఆడపిల్ల అయితే గర్భవిచ్ఛిత్తి
కోట్లాది రూపాయల ఆర్జన
డాక్టర్లు, వైద్యసిబ్బంది సహా
9 మంది అరెస్టు
ముఠాకు విస్తృతంగా నెట్‌వర్క్
డబ్బుల కోసం దోపిడీలు, మోసాలు చేసేవారు ఒక ఎత్తయితే, కడుపులోని శిశువులతోనే ధనార్జన చేసేవారు మరొక ఎత్తు. రెండో కోవకు చెందిన ముఠాలు ఐటీ సిటీలో పట్టుబడ్డాయి. దొరకని ముఠాలు ఎన్నో మరి!

అమ్మ కడుపులోనూ భద్రత కరువు

పుట్టబోయేది ఆడపిల్ల అయితే గర్భంలోనే చిదిమేసేవారు