సోషల్.. హల్‌సెల్
హోరెత్తుతున్న సోషల్ మీడియా
పంచాయతీలు, వార్డుల వారీగా వాట్సాప్ గ్రూపులు
తమను గెలిపించాలంటూ పోస్టులు, వీడియోలు
మొదటి విడత గుర్తుల కేటాయింపుతో ప్రచారం గరంగరం
కరీంనగర్: గతంలో గోడలపై రాతలు, వాల్‌పోస్టర్లు, కరపత్రాలతో ప్రచారం చేసే అభ్యర్థులు.. ఎన్నికల నిబంధనలతో నయా ట్రెండ్ ఫాలో అవుతున్నారు. సెల్‌ఫోన్‌ను నమ్ముకుని ప్రచారం సాగి స్తున్నారు. సోషల్ మీడియా వారియర్స్‌ను ఏర్పాటు చేసుకొని ప్రత్యేక విభాగాన్ని నడిపిస్తున్నారు. సాధారణ ఎన్నికలను తలపించే విధంగా ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయి. గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు పావులు కదుపుతున్నారు. ఏ ఒక్క ఓటునూ వదలకూడదని జాబితా ముందేసుకుని మరీ ఎక్క డ ఉన్నారో వెతుకుతున్నారు. చిరునామా, ఫోన్ నంబర్ తెలుసుకునే పనిలో పడ్డారు. గ్రామీణ ప్రాంతాలను వదలి ఉద్యోగాలు, ఉపాధి నిమిత్తం ఇతర ప్రాంతాల్లో ఉంటున్న వారికి ఫోన్లు చేసి.. వరుసలు కలిపేసి.. మాటలతో మస్కా కొడుతున్నారు. ఫోన్ నంబర్ దొరికితే చాలు డిజిటల్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. సర్పంచ్, వార్డు మెంబర్‌గా పోటీ చేస్తున్న అభ్యర్థులు స్మార్ట్‌ఫోన్ల ప్రచారానికి పెద్ద పీట వేస్తున్నారు. మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్లు, స్క్రూటినీ, విత్‌డ్రా ముగిశాక బుధవారం గుర్తుల కేటాయించారు. దీంతో పోటీదారులు ఇంటింటికి తిరగడంతో పాటు వాట్సాప్‌లో పోస్టులనే నమ్ముకున్నారు. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్‌లో ప్రచారం ముమ్మురం చేస్తున్నారు. గ్రామానికి చెందిన ఓటర్ల ఫోన్ నంబర్లను తెలుసుకుని గ్రూప్‌లు తయారు చేసి తమకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థిస్తున్న ఫొటోలు, వీడియోలు పంపిస్తున్నారు. తాము గెలిస్తే ఏం చేస్తారో అన్న విషయాన్ని కూడా షేర్ చేస్తున్నారు. కుల సంఘాల వారికి ఫోన్లు చేస్తూ మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. అనుచరుల ఫోన్లలో స్టేటస్ పెట్టుకొని మరీ ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం యువకులు ప్రతి గ్రామానికి ఒక వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేయగా ఆయా గ్రామాల గ్రూపులలో వీడియోలు షేర్ చేస్తున్నారు. ఇప్పటి వరకు గ్రామంలో తాము చేసిన సేవలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఎడిట్ చేసి వాటికి బ్యాక్‌గ్రౌడ్ పాటలను సెట్ చేసి మరీ పంపిస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకునేలా సోషల్ మీడియాలో నిత్యం పోస్టులు పెడుతున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల వరకు కొంత మంది యువకులతో కమిటీ వేసి సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారు.


