స్లాట్‌ బుకింగ్‌ షురూ.. | - | Sakshi
Sakshi News home page

స్లాట్‌ బుకింగ్‌ షురూ..

Jun 3 2025 12:12 AM | Updated on Jun 3 2025 12:12 AM

స్లాట

స్లాట్‌ బుకింగ్‌ షురూ..

కరీంనగర్‌క్రైం: రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో స్లాట్‌ బుకింగ్‌ పద్ధతి ప్రారంభమైంది. ప్రభుత్వం తొలుత కొన్ని రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో పైలెట్‌ ప్రాజెక్టుగా అమలు చేయగా.. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్‌ 2 నుంచి అన్ని కార్యాలయాల్లో ప్రారంభించారు. తొలిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రజలు బుక్‌ చేసుకున్న స్లాట్ల ప్రకారం సమయానికి వచ్చారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లావ్యాప్తంగా 14 సబ్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు ఉండగా తొలిరోజు 145 డాక్యుమెంట్లు స్లాట్‌బుకింగ్‌ పద్ధతిలో రిజిస్ట్రేషన్‌ అయ్యాయి.

వాట్సాఫ్‌లో సందేహాల నివృత్తి

ఆస్తుల క్రయవిక్రయదారులు స్టాంపులు, రిజిస్ట్రేషన్‌శాఖ వెబ్‌సైట్‌ ద్వారా నేరుగా సందేహాలు నివృత్తి చేసుకునేందుకు 8247623578 నంబర్‌ ఏర్పాటు చేశారు. ఈ నంబర్‌ వాట్సాప్‌ ద్వారా కావాల్సిన విషయాలు తెలుసుకోవచ్చు. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం లొకేషన్‌, స్లాట్‌బుకింగ్‌ ఖాళీల వివరాలు, అందుబాటులో ఉండే సమయం, డీడ్‌వారిగా రిజిస్ట్రేషన్‌ చార్జీలు, మార్కెట్‌ విలువలు వాట్సప్‌ మెసేజ్‌ ద్వారా తెలుసుకోవచ్చు.

రోజుకు 48స్లాట్లు.. ఐదు వాకిన్‌ రిజిస్ట్రేషన్లు

ప్రతిరోజు జిల్లాలోని అన్ని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో స్లాట్‌ బుకింగ్‌ ద్వారా 48 రిజిస్ట్రేషన్లు చేయవచ్చు. అత్యవసర సమయాల్లో ఐదు వాకిన్‌ రిజిస్ట్రేషన్లు చేసేలా అవకాశం కల్పించారు. స్లాట్‌ బుకింగ్‌ రిజిస్ట్రేషన్లు ఉదయం 10.30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు, వాకిన్‌ రిజిస్ట్రేషన్లు సాయంత్రం ఐదు గంటల నుంచి 5.30 గంటల వరకు జరిపేలా ఏర్పాట్లు చేశారు. కరీంనగర్‌ సబ్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో ఇద్దరు సబ్‌ రిజిస్ట్రార్లు ఉన్నారు. ఒక సబ్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయానికి 48 రిజిస్ట్రేషన్లు, వాకిన్‌ రిజిస్ట్రేషన్లు ఐదు అనుమతించారు. మరొక సబ్‌ రిజిస్ట్రార్‌కు పెద్దగా పని ఉండకపోవచ్చని, అదనంగా ఉన్న సబ్‌ రిజిస్ట్రార్‌ను వేరే చోటుకు సర్దుబాటు చేసే అవకాశాలున్నట్లు కార్యాలయవర్గాల్లో చర్చ జరుగుతోంది.

నిరీక్షణకు తెర

స్లాట్‌బుకింగ్‌ విధానంతో గంటల తరబడి నిరీక్షణకు తెరపడింది. గతంలో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రిజిస్ట్రార్‌ వచ్చే ముందు డాక్యుమెంట్లు వరుసలో పెట్టేవారు. కార్యాలయంలో ఉదయం 10.30 వరకే కొన్ని డాక్యుమెంట్లు ఉండేవి. అవన్నీ చెక్‌స్లిప్‌ నమోదు చేయడం, స్కానింగ్‌, సబ్‌రిజిస్ట్రార్‌ బయెమెట్రిక్‌, క్రయవిక్రయదారుల వేలిముద్రలు వేయడం పద్ధతిలో రిజిస్ట్రేషన్‌ కొనసాగేది. డాక్యుమెంట్‌ రిజిస్ట్రేషన్‌ పూర్తయ్యే వరకు ఉదయం నుంచి సాయంత్రం వరకు వేచి ఉన్న సందర్భాలు అనేకం. ఇప్పుడు ముందస్తుగానే ప్రొహిబిటెడ్‌ లిస్ట్‌లో ఉందో లేదో చెక్‌ చేసుకొని, ఆన్‌లైన్‌లో చెక్‌స్లిప్‌ నమోదు చేయడం, క్రయవిక్రయదారులకు చెందిన ఆస్తులు, హద్దుల వివరాలు పూర్తిగా చదువుకొని సరిగ్గా ఉన్న తర్వాతే స్లాట్‌ బుకింగ్‌ చేసుకునే విధంగా ఉండడంతో సులభంగా, పారదర్శకంగా ఉంటుంది. పాత పద్ధతి కన్నా.. కొత్త స్లాట్‌ బుకింగ్‌ విధానం సులభంగా, సౌకర్యవంతంగా ఉందని క్రయవిక్రయదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

స్టాంపులు, రిజిస్ట్రేషన్‌శాఖలో ప్రారంభమైన నూతన విధానం

తొలి రోజు ఉమ్మడి జిల్లాలో 145 రిజిస్ట్రేషన్లు

రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో తగ్గనున్న రద్దీ

సమయం ఆదా అవుతుందంటున్న ప్రజలు

సమయం వృథా కాదు

కొత్తగా స్లాట్‌ విధానం సోమవారం నుంచి అమలు చేస్తున్నాం. నిర్ణీత సమయంలో ముందస్తుగా స్లాట్‌ బుకింగ్‌ చేసుకొని రిజిస్ట్రేషన్‌ కార్యాలయానికి వస్తే పది నిమిషాల్లో ప్రక్రియ పూర్తి చేసి పంపిస్తున్నాం. కొత్త విధానం ద్వారా క్రయవిక్రయదారులకు సమయం వృథా కాదు.

– రవికుమార్‌, కరీంనగర్‌ సబ్‌ రిజిస్ట్రార్‌

స్లాట్‌ బుకింగ్‌ బాగుంది

రిజిస్ట్రేషన్లలో స్లాట్‌ బుకింగ్‌ విధానం బాగుంది. మాకు సంబంధించిన ఒక ఆస్తికి చెందిన క్రయవిక్రయాలకు చెందిన విషయాలు ముందుగానే ఎంటర్‌ చేస్తే, కావాల్సిన సమయానికి స్లాట్‌ బుకింగ్‌ అవుతుంది. దాని ప్రకారం వెళ్తే పదినిమిషాల్లో ప్రక్రియ పూర్తి చేసి పంపిస్తున్నారు.

– కాడే రమేశ్‌, కట్టరాంపూర్‌, కరీంనగర్‌

స్లాట్‌ బుకింగ్‌ షురూ..1
1/2

స్లాట్‌ బుకింగ్‌ షురూ..

స్లాట్‌ బుకింగ్‌ షురూ..2
2/2

స్లాట్‌ బుకింగ్‌ షురూ..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement