
అమ్మే.. అన్నీ తానై
● కష్టాలను ఎదురొడ్డి.. ● పిల్లలను ప్రయోజకులను చేసి
● ఆదర్శంగా ఉమ్మడి జిల్లాలోని మాతృమూర్తులు ● నేడు మదర్స్ డే
ప్రతికూల పరిస్థితుల్లో కష్టాలకు ఎదురొడ్డారు.. ఇంటి పెద్ద దూరమైనా.. మొక్కవోని ధైర్యంతో కుటుంబ భారాన్ని తలకెత్తుకున్నారు.. ఎవరి సాయం లేకున్నా రెక్కల కష్టాన్ని నమ్ముకుని పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ప్రయోజకులుగా చేశారు ఆ మాతృమూర్తులు. ఇంకొందరు ప్రాణాలను లెక్కచేయకుండా తమ కంటిపాపలకు అవయవదానం చేసి ఆదర్శంగా నిలిచారు. నేడు మాతృదినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనాలు..
కంటికి రెప్పలా కాపాడి..
మల్యాల(చొప్పదండి): తండ్రి వేలు పట్టుకొని నడక నేర్చిన జ్ఞాపకాలు ఆ చిన్నారులకు లేవు. చిన్ననాడే తండ్రి కనుమూస్తే ఆ తల్లే తండ్రిగా బాధ్యత తీసుకుంది. బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ 25ఏళ్లుగా కూలీపని చేస్తూ పిల్ల లను పోషించింది. మల్యాల మండలం పోతారం గ్రామానికి చెందిన కట్కూరి శంకర్–లక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు రాజు, రంజిత్, కుమార్తె రాధ సంతానం. పిల్లల చిన్నతనంలోనే శంకర్ మృతిచెందాడు. అప్పటి నుంచి నిత్యం కూలీ పనులకు వెళ్తూ కుటుంబాన్ని వెళ్లదీసింది లక్ష్మి. పెద్ద కుమారుడు తల్లికి ఆసరాగా ఉంటూ, తమ్ముడు, చెల్లెకు తోడుగా నిలిచాడు. ఓ ప్రైవేట్ స్కూల్ వ్యాన్‌పై పనిచేస్తున్నాడు. చిన్న కుమారుడిని ఇంటర్ వొకేషనల్ కోర్సు చదివించింది. ప్రస్తుతం జగిత్యాలలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ల్యాబ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. కూతురు రాధకు వివాహం చేసింది.
అమ్మకు తోడుగా ఉంటాం
నాన్న ప్రేమ తెలియదు. అమ్మే లోకంగా, అమ్మ కష్టం చూసుకుంటూ పెరిగినం. నేను స్కూల్‌కు వెళ్తే అమ్మ పనికి వెళ్లేది. నిత్యం ఏదో ఒక పనికి వెళ్లి మమ్మల్ని పోషించింది. అమ్మను కళ్లలో పెట్టి చూసుకుంటాం. – రంజిత్, చిన్న కుమారుడు