
అమ్మంటే అమ్మాయే..
పెగడపల్లి(ధర్మపురి): పెగడపల్లి మండలం బతికపల్లి గ్రామానికి చెందిన పంగ అమ్మాయికి ఇద్దరు కుమారులు అజయ్, రమేశ్, కుమార్తె అంజలి సంతానం. 25 ఏళ్ల క్రితం భర్త రాజలింగం కాలం చేశాడు. దీంతో ముగ్గురు పిల్లల బాధ్యత ఆమైపె పడింది. తన రెక్కల కష్టాన్నే నమ్ముకుంది. పుట్టింటి వారు తాము చూసుకుంటామని చెప్పినా వెళ్లలేదు. వంశపారంపర్యంగా వంతుల వారీగా ఆరు నెలలకోమారు గ్రామ సేవకురాలిగా, ఆ తర్వాత రోజుల్లో కూలీ పనులకు వెళ్లి పిల్లలను చదివించింది. ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో తన పిల్లలను చేర్పించి చదువులకు ప్రోత్సహించింది. తల్లి కష్టాన్ని పిల్లలు వృథా చేయలేదు. పెద్ద కొడుకు అజయ్ ఇంజినీరింగ్ చదివి పోస్టల్ ఉద్యోగం చేస్తున్నాడు. చిన్న కొడుకు రమేశ్ ఉస్మానియాలో ఎంబీబీఎస్, తర్వాత ఎండీ అనస్తీషియా చదివి ప్రస్తుతం కరీంనగర్‌లోని ఓ నర్సింగ్ హోమ్ నిర్వహిస్తూ అదే ఆసుపత్రిలో విధులు నిర్వహి స్తున్నాడు. కూతురు అంజలి బీటెక్ పూర్తి కాగానే వివాహం జరిగింది. పిల్లల చిన్న తనంలోనే భర్త చనిపోయినా వెరవకుండా చాలీచాలని కూలీ డబ్బులతో వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దడానికి తాను పడ్డ కష్టాలను గుర్తు చేసుకుని ఆవేదన చెందారు అమ్మాయి. తన కుమారులు ఉద్యోగాలు సాధించారని, అదే తనకు సంతోషాన్నిచ్చే విషయమని, వారిని చూస్తే తన కష్టాన్ని మరచిపోతానని చెప్పుకొచ్చారు.