
ఈసారైనా సిరులు కురిపించేనా..?
వేములవాడ: ఎములాడ రాజన్నకు భక్తులు సమర్పించుకునే కురులతో ఏటా సిరులు కురిశాయి. ఈనేపథ్యంలో కరోనా కాలంలో కల్యాణకట్టను మూసివేశారు. తర్వాత 2023–25 రెండేళ్ల కోసం నిర్వహించిన తలనీలాల సేకరణ టెండర్ రూ. 19.01 కోట్లకు పెరిగింది. దీంతో రాజన్నకు భక్తు ల కురులు సిరులు కురిపించాయి. అయితే ఏడాదిపాటు సక్రమంగా చెల్లింపులు చేసిన సదరు కాంట్రాక్టర్ పది నెలలుగా సేకరణ నిలిపివేసి చే తులెత్తేశాడు. దీంతో అధికారులు రంగంలోకి దిగి నేరుగా తలనీలాలను సేకరించి భద్రపరిచారు. టెండర్ సమయం 11 ఏప్రిల్ 2025తో ముగిసింది. ఈలోగా సదరు కాంట్రాక్టర్ కొన్ని డబ్బులను స్వామివారికి చెల్లించి మిగతా డబ్బు జూన్ వరకు చెల్లిస్తానని అగ్రిమెంట్ చేశారు. ఇందుకు ప్రభుత్వం నుంచి ఓ స్పెషల్ ఆర్డర్ కూడా రావడం గమనార్హం.
నేడు ఏడోసారి.. ఈ– టెండర్‌కే మొగ్గు
రాజన్నకు భక్తులు కల్యాణకట్టలో సమర్పించుకునే తలనీలాలను పోగు చేసుకునే హక్కు కోసం గత టెండర్ ఏప్రిల్ 11తో ముగియగా, అంతకుముందే నాలుగుసార్లు ప్రకటన చేసి టెండర్ నిర్వహించారు. కానీ ఎవరూ హాజరుకాలేదు. ఐదోసా రి రూ.13.67 కోట్లు, ఆరోసారి రూ. 14.01 కోట్లు కాంట్రాక్టర్లు టెండర్లలో పాల్గొన్నారు. ఆశించినంత డబ్బు రాకపోయేసరికి ఆలయ అధికారులు నిబంధనల మేరకు టెండర్‌ను రద్దు చేశారు. దీంతో బుధవారం ఏడోసారి తలనీలాల టెండర్ నిర్వహించనున్నారు. అయితే ఈసారి సీల్డ్ టెండర్, బహిరంగ వేలం పాటలను ఆలయ అధికారులు రద్దు చేసి కేవలం ఈ–టెండర్‌కు మాత్రమే అవకాశం కల్పించారు. ఈసారైనా భక్తుల కురులతో రాజన్నకు సిరులు కురుస్తాయా.. లేదా వేచి చూడాల్సిందే.
తలనొప్పిగా తలనీలాల సేకరణ
భక్తుల తలనీలాల సేకరణ ఆలయ అధికారులకు తలకు మించిన భారంగా మారింది. టెండర్ నిర్వహించి కాంట్రాక్టర్‌కు అప్పగిస్తే ఈ పనులు కాంట్రాక్టరే తమ వ్యక్తులను ఏర్పాటు చేసుకుని నిర్వహించేవారు. అయితే కాంట్రాక్టర్ల నుంచి సరైన స్పందన రాక కల్యాణకట్ట నుంచి తలనీలాలను సేకరించి పోగు చేయడం ఇబ్బందిగా మారిందని అధికారులు, సిబ్బంది వాపోతున్నారు. సీసీ కెమెరాలు, ప్రత్యేక సిబ్బంది, సెక్యూరిటీతో తలనీలాలను సేకరిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.
రాజన్న భక్తుల తలనీలాల సేకరణకు నేడు ఏడోసారి టెండర్
ఈ–టెండర్‌తో సరి
బహిరంగ వేలం, సీల్డ్ టెండర్లు రద్దు