
పుస్తకం గురువుతో సమానం
రామడుగు/మల్యాల: ప్రతీ వ్యక్తికి పుస్తకం ఒక గురువులాంటిదని మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నేరెళ్ల శారద అన్నారు. రామడుగు మండలం వెదిర జిల్లా పరిషత్తు పాఠశాలలో ఆకర్షణ సతీశ్ 22వ గ్రంథాలయాన్ని మంగళవారం ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. కేరళకు చెందిన 9వ తరగతి విద్యార్థి ఆకర్షణ సతీశ్ ఇప్పటి వరకు 21గ్రంథాలయాలు ఏర్పాటు చేశారని, 22వది వెదిరలో ఏర్పా టు చేయడం అభినందనీయం అన్నారు. విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇంటర్‌లో మంచి మార్కులు సాధించిన కోరుకండ్ల పల్లవి, ప్రణీతను సత్కరించారు. పద్మశాలివాడ నుంచి గణేశ్‌నగర్ వరకు రూ.50లక్షల ఉపాధి హామీ నిధులతో నిర్మించిన సీసీరోడ్డు ప్రారంభించారు. కలెక్టర్ పమేలా సత్పతి, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, తహసీల్దార్ రాజేశ్వరీ, ఎంపీడీవో రాజేశ్వరీ, ఎంఈవో వేణుకుమార్, హెచ్‌ఎం రాజమౌళి పాల్గొన్నారు.
లివింగ్ రిలేషన్ మంచిది కాదు
యువత చెడుదారిన వెళ్లవద్దని, తల్లిదండ్రులు తలవంచుకునేలా ఆకర్షణే ప్రేమగా భావించి, లివింగ్ రిలేషన్‌కు వెళ్లవద్దని మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నేరెళ్ల శారద అన్నారు. మల్యాల మండలం కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామిని కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. అనంతరం మా ట్లాడుతూ తెలంగాణలో మహిళల ఫిర్యాదులు పెరిగాయని, కౌన్సెలింగ్ చేస్తూ తక్షణమే పరిష్కరించేలా కృషి చేస్తున్నామని అన్నారు. మహిళలతోపాటు పురుషులుసైతం మహిళా కమిషన్‌ను సంప్రదిస్తున్నారని అన్నారు. తమ పరిధిని మించిన వాటినిసైతం మానవీయ కోణంలో స్పందిస్తూ, కొన్ని సందర్భాల్లో సుమోటాగా స్వీకరించి, సమస్యల పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. లివింగ్ రిలేషన్‌షిప్‌లో ఉన్నవారుసైతం తమ సమస్యల పరిష్కారం కోసం కమిషన్‌ను సంప్రదిస్తున్నారని, యువతీ, యువకులు లివింగ్ రిలేషన్‌ను ఎంచుకోవద్దని సూచించారు. కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాభివృద్ధి తనవంతు కృషి చేస్తామని తెలిపారు.