
‘బడికి అండగా నిలుస్తా’
రామారెడ్డి: చిన్నతనంలో తాను చదివిన రామారెడ్డి సర్కార్ బడి అభివృద్ధికి అన్ని విధాలుగా అండగా నిలుస్తానని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు పేర్కొన్నారు. గురువారం రామారెడ్డి, గోకుల్ తండా, గిద్ద గ్రామాలలో పర్యటించారు. రామారెడ్డి ప్రభుత్వ పాఠశాలను పరిశీలించారు. తను చిన్నతనంలో ఇదే మైదానంలో ఆడుకున్నానని, ఇక్కడే చదువుకున్నానని గుర్తు చేసుకున్నారు. రామారెడ్డి సర్కారు బడికి కావలసిన అదనపు తరగతి గదులు, మరుగుదొడ్లను వెంటనే నిర్మిస్తానన్నారు. అనంతరం రామారెడ్డి మైదానంలో విద్యార్థులతో కలిసి ఫుట్‌బాల్ ఆడారు. నిర్మాణంలో ఆగిపోయిన గంగమ్మ వాగు బ్రిడ్జిని పరిశీలించి పనులు ప్రారంభించేలా చూస్తామన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు లక్ష్మాగౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రవీణ్ గౌడ్, నాయకులు అరవింద్ గౌడ్, బీపేట నర్సింలు, అంబానీ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.