
కారు ఢీకొని వ్యాపారి మృతి
ఏలేశ్వరం: అతివేగంగా ప్రయాణిస్తున్న కారు ఢీకొనడంతో ఓ వ్యాపారి మృతి చెందిన సంఘటన ఇది. స్థానికులు, పోలీసుల వివరాల మేరకు, పట్టణానికి చెందిన గూడపాటి నాగసత్య చంద్రశేఖర్(44) పాత ఆంధ్రా బ్యాంక్ ఎదురుగా చెప్పుల షాపు నిర్వహిస్తున్నాడు. షాపు వద్దే అతడి ఇల్లు కూడా ఉంది. షాపు వెనుక భాగంలో భవనాన్ని నిర్మిస్తున్నాడు. ఈ క్రమంలో నల్లరాయి చిప్స్ లారీ వస్తుందని సమాచారం రావడంతో, మంగళవారం అర్థరాత్రి దాటాక రెండు గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వచ్చాడు. ఆ సమయంలో వర్షం కురుస్తోంది. గొడుగు వేసుకుని.. షాపు ఎదురుగా రోడ్డు దాటుతుండగా, యర్రవరం రోడ్డులో ఏలేశ్వరం వైపు అతివేగంగా వచ్చిన కారు అతడిని ఢీకొంది. ఈ ప్రమాదంలో చంద్రశేఖర్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు. సమీపంలోని షాపులో ఉన్న సీసీ కెమెరాలో ప్రమాద సంఘటన రికార్డు అయినట్టు పోలీసులు గుర్తించారు. మృతుడికి భార్య దివ్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రత్తిపాడు ఆస్పత్రిలో పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
నవ్వుతూ ఉండే వ్యక్తి
ఎప్పుడూ నవ్వుతూ చలాకీగా ఉండే చంద్రశేఖర్.. రోడ్డు ప్రమాదంలో మృతిచెందడాన్ని అతడి బంధువులు, స్నేహితులు జీర్ణించుకోలేకపోతున్నారు. అతడి మృతితో భార్యాపిల్లలు, తల్లిదండ్రులు తీవ్రంగా విలపిస్తున్నారు. వీరిని ఓదార్చడం బంధువులకు కష్టంగా మారింది.