
శృంగార వల్లభునికి రూ.31.66 లక్షల ఆదాయం
పెద్దాపురం: తొలి తిరుపతి గ్రామంలో స్వయంభువుగా వెలసిన శృంగార వల్లభ స్వామి వారికి అన్నదానం, హుండీల ద్వారా రూ.31,66,081 ఆదాయం సమకూరింది. జిల్లా దేవదాయ శాఖ అధికారి కె.నాగేశ్వరరావు, డివిజనల్ ఇన్‌స్పెక్టర్ వి.ఫణీంద్ర కుమార్, సర్పంచ్ మొయిళ్ల కృష్ణమూర్తి సమక్షంలో ఆలయంలోని హుండీలను మంగళవారం తెరచి, ఆదాయం లెక్కించారు. మొత్తం 104 రోజులకు గాను ఆలయ హుండీల ద్వారా రూ.23,89,935, అన్నదానం హుండీ ద్వారా రూ.7,76,146 మేర ఆదాయం సమకూరిందని ఆలయ కార్యనిర్వహణాధికారి వడ్డి శ్రీనివాస్ తెలిపారు. కార్యక్రమంలో అర్చకులు పెద్దింటి పురుషోత్తమాచార్యులు, నారాయణాచార్యులు తదితరులు పాల్గొన్నారు.
అరుణాచలానికి 8న ప్రత్యేక బస్సులు
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): గురు పౌర్ణమి సందర్భంగా ఈ నెల 8న జిల్లాలోని మూడు డిపోల నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి ఎం.శ్రీనివాసరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కాకినాడ, ఏలేశ్వరం, తుని డిపోల నుంచి ఆ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఈ బస్సులు బయలుదేరుతాయన్నారు. కాణిపాకం, శ్రీపురం దర్శనానంతరం అరుణాచలం చేరుతాయని తెలిపారు. తిరుగు ప్రయాణంలో శ్రీకాళహస్తి దర్శనానంతరం ఈ నెల 11న ఆయా డిపోలకు చేరుతాయని వివరించారు. పూరీ జగన్నాథ రథయాత్రకు వెళ్లేందుకు కూడా స్పెషల్ బస్సులు సిద్ధం చేశామని శ్రీనివాసరావు తెలిపారు.
ఆర్‌అండ్‌బీ ప్రాజెక్ట్స్ ఈఈగా సీతయ్య
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లా రోడ్లు, భవనాల (ఆర్‌అండ్‌బీ) శాఖ ప్రాజెక్టు ఈఈగా ఎన్.సీతయ్య మంగళవారం కాకినాడలో బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఈఈగా పని చేస్తున్న మల్లికార్జున రిటైరయ్యారు. ఆయన స్థానంలో కొయ్యలగూడెం డీఈగా ఉన్న సీతయ్యకు ఈఈగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆయనను పీఆర్ ఇంజినీర్స్ అసోసియేషన్ ప్రతినిధులు అన్యం రాంబాబు తదితరులు అభినందించారు.
కుమార సుబ్రహ్మణ్యేశ్వరునికి అభిషేకాలు
బిక్కవోలు: స్థానిక శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వరుని ఆలయంలో స్వామివారికి పెద్ద సంఖ్యలో భక్తులు మంగళవారం అభిషేకాలు నిర్వహించారు. స్వామివారికి ప్రీతికరమైన మంగళవారం, షష్ఠి కలసి రావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలి వచ్చారు. అభిషేకాల అనంతరం స్వామివారికి అర్చకులు ప్రత్యేక అలంకరణ చేశారు. దేవదాయ శాఖ ఆధ్వర్యాన అన్నసమారధన నిర్వహించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందీ కలగకుండా ఈఓ రామలింగ భాస్కర్ ఆధ్వర్యాన సిబ్బంది ఏర్పాట్లు చేశారు.

శృంగార వల్లభునికి రూ.31.66 లక్షల ఆదాయం