
పట్టాభిరామ్ మనవారే..
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ప్రముఖ ఇంద్రజాలికుడు, వ్యక్తిత్వ వికాస నిపుణుడు బీవీ పట్టాభిరామ్ ఆకస్మిక మరణంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో విషాదఛాయలు అలముకున్నాయి. పట్టాభిరామ్కు ఈ జిల్లాతో విడదీయరాని అనుబంధమే ఉంది. ఉమ్మడి జిల్లాలోని కె.గంగవరం మండలం దంగేరులో ఆయన పూర్వీకులు నివాసం ఉండేవారు. అక్కడ నుంచి ద్రాక్షారామ సమీపంలోని దొడ్డంపేటలో తల్లిదండ్రులతో కలిసి నివాసముండగా పట్టాభిరామ్ రామచంద్రపురంలో ప్రాథమిక, మాధ్యమిక విద్యను అభ్యసించారు. ఉన్నత చదువుల కోసం కాకినాడ వచ్చి అక్కడి పీఆర్ కళాశాలలో ఉన్నత విద్య అభ్యసించారు. కాలి వైకల్యంతో ఉన్న ఆయన ఆ లోపం కనపడకుండా ఉండేందుకు.. తండ్రి రావు సాహెబ్ భావరాజు సత్యనారాయణ సూచన మేరకు ప్రముఖ ఇంద్రజాలికుడు ఎంబీ రావ్ వద్ద ఇంద్రజాలంలో శిక్షణ పొందారు. అక్కడ నుంచి ఆయన వెనుదిరిగి చూడలేదు. కాకినాడ నుంచి హైదరాబాద్‌లో భారత ఆహార సంస్థ ఉద్యోగిగా ఉంటూ అనేక ఇంద్రజాల ప్రదర్శనలు ఇస్తూ జిల్లా పేరు ప్రతిష్టలను రాష్ట్రవ్యాప్తం చేశారు. ఇంద్రజాలంతో పాటు వ్యక్తిత్వ వికాసంపై అనేక పుస్తకాలు రాశారు. ఇంద్రజాలం అంటే ఒక వినోదం మాత్రమే కాదని, మూఢనమ్మకాలపై పరోక్షంగా ఒక యుద్ధాన్ని చేశారు. 1949లో జన్మించిన పట్టాభిరామ్ 75 ఏళ్ల వయసులో ఖైరతాబాద్‌లో మృతి చెందడంతో ఈ ప్రాంత వాసులు ఆయన సేవలను గుర్తు చేసుకుంటున్నారు.