
మారీటైమ్ బోర్డుకు సాల్ట్ భూములు బదలాయించాలి
కాకినాడ సిటీ: జిల్లాలో కేంద్ర ప్రభుత్వ సాల్ట్ డిపార్టుమెంట్‌కు చెందిన 1,245.28 ఎకరాల భూములను రాష్ట్ర మారీటైమ్ బోర్డుకు బదలాయించాల్సి ఉందని జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా తెలిపారు. ఈ మేరకు ఈ భూముల ధరను నిర్ణయించేందుకు ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి కమిటీ సమావేశం మంగళవారం కలెక్టరేట్‌లో జరిగింది. దీనికి అధ్యక్షత వహించిన జేసీ మాట్లాడుతూ, కాకినాడ, కరప, తాళ్లరేవు మండలాల్లో ఉన్న సాల్ట్ డిపార్టుమెంట్ భూములను రాష్ట్ర మారీటైమ్ బోర్డుకు బదిలీ చేసేందుకు ధర నిర్ణయించాల్సిందిగా చైన్నెలోని డిప్యూటీ సాల్ట్ కమిషనర్ను కోరారన్నారు. ఈ భూముల విలువను కలెక్టర్ షణ్మోహన్ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ నిర్ణయిస్తుందన్నారు. గురజనాపల్లి, చొల్లంగి గ్రామాల్లో 626.37 ఎకరాలు, పెనుగుదురులో 501.26 ఎకరాలు, కాకినాడ జగన్నాథపురం, సాల్ట్ సూపరింటెండెంట్ ఆఫీసు ప్రాంగణంలో 117.65 ఎకరాల చొప్పున ఈ భూములున్నాయని వివరించారు. ఈ భూములను సంబంధిత తహసీల్దార్లు, సబ్ రిజిస్ట్రార్లు పరిశీలించి, వాటి స్థితి, ధర వివరాలతో కమిటీకి నివేదిక అందజేయాలని జేసీ ఆదేశించారు. సమావేశంలో డీఆర్‌ఓ జె.వెంకటరావు, ఆర్‌డీఓ ఎస్.మల్లిబాబు తదితరులు పాల్గొన్నారు.
లీఫియస్ ప్లాంట్ ప్రారంభించండి
సాక్షి ప్రతినిధి, కాకినాడ: పరిశ్రమలు తీసుకువచ్చి సంపద సృష్టిస్తానంటున్న ప్రభుత్వం కాకినాడ ఎస్‌ఈజెడ్‌లో రూ.2,400 కోట్లతో సిద్ధమైన లీఫియస్ పెన్సిలిన్ ప్లాంట్‌కు ఎందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదని రాక్స్ మాల మహానాడు, సర్వజన సమాజ్ జాతీయ అధ్యక్షుడు ఆర్‌ఎస్ రత్నాకర్ ప్రశ్నించారు. కాకినాడలో మంగళవారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. సాంకేతిక సమస్యలతో నాలుగు నెలలుగా ప్లాంట్ నిర్వహణలోకి తీసుకురాకపోవడం అన్యాయమన్నారు. దీంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడిన 2,500 కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉందన్నారు. ప్లాంట్‌లో ఉత్పత్తి ప్రారంభించి, ఉద్యోగుల జీతభత్యాలకు ఇబ్బందులు తలెత్తకుండా యాజమాన్యం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పెన్సిలిన్–జీ యాంటీ బయోటిక్‌ను పెన్సిలియం క్రైసోజినం ఫంగస్ ఉపయోగించి ఫెర్మెంటేషన్ ద్వారా ఈ ప్లాంట్‌లో ఉత్పత్తి చేస్తున్నారన్నారు. ఈ ప్లాంట్‌కు ఏటా 15 వేల టన్నుల పెన్సిలిన్–జి, 1.8 లక్షల టన్నుల గ్లూకోజ్, 6 అమైనో పెన్సిల్లానిక్ యాసిడ్ 3,600 టన్నులు ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉందని రత్నాకర్ తెలిపారు.
పీజీ ఈసెట్‌లో
93.85 శాతం ఉత్తీర్ణత
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఆంధ్రా యూనివర్సిటీ నిర్వహించిన పీజీ ఈసెట్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు 93.85 శాతం మేర ఉత్తీర్ణత సాధించారు. పీజీ విభాగంలో 13 సబ్జెక్టులకు సంబంధించి ఈ పరీక్షకు 931 మంది దరఖాస్తు చేసుకోగా 764 మంది రాశారు. వీరిలో 717 మంది ఉత్తీర్ణులయ్యారు. కెమికల్ ఇంజినీరింగ్ విభాగంలో కుంచె సుదర్శన్ (కాకినాడ రూరల్ పెనుమర్తి) 7, సివిల్ ఇంజినీరింగ్‌లో అల్లు సాయి నవీన్ (పెద్దాపురం) 8, కె.వెంకట రామప్రసాద్‌వర్మ 10, ఈఈఈ విభాగంలో ఎస్.లాస్య (సామర్లకోట) 3, సి.సత్య వెంకట లోవ శివ సమీర్ (తొండంగి) 10, ఎం.కృష్ణ కౌశిక్ (దుర్గాడ) 10, ఫుడ్ టెక్నాలజీలో బిళ్లకుర్తి జ్యోతి (కాకినాడ) 4, ఇన్‌స్ట్రుమెంట్ విభాగంలో రాయుడు సాయిరామ్ (జగన్నాథగిరి) 1, పి.సాయి (ఎ.కొత్తపల్లి) 4, మెకానికల్ విభాగంలో కె.లోకేష్ (సీతారామపురం) 1, మెటలర్జీ విభాగంలో ఎం.నాగేశ్వరి (పేపకాయయలపాలెం) 4, నానో టెక్నాలజీలో కె.విశాల్ (సర్పవరం) 9 ర్యాంకులు సాధించారు.
ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగుల బదిలీల
సీనియారిటీ జాబితా విడుదల
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): సమగ్ర శిక్షా అభియాన్‌లో పని చేస్తున్న టీచింగ్, నాన్ టీచింగ్, కేజీబీవీ, పీటీ, సీఆర్‌ఎంటీఎస్, ఎంఐఎస్‌లకు సంబంధించిన ఉద్యోగుల బదిలీల సీనియారిటీ జాబితాను సమగ్ర శిక్ష తూర్పు గోదావరి వెబ్‌సైట్‌లో ఉంచినట్లు ప్రాజెక్టు కో ఆర్డినేటర్ పి.వేణుగోపాలరావు మంగళవారం తెలిపారు. అభ్యంతరాలుంటే ఈ నెల 27వ తేదీలోగా తెలియజేయాలని సూచించారు.

మారీటైమ్ బోర్డుకు సాల్ట్ భూములు బదలాయించాలి