కౌలుకోలేని దెబ్బ | - | Sakshi
Sakshi News home page

కౌలుకోలేని దెబ్బ

Jun 24 2025 3:45 AM | Updated on Jun 24 2025 3:45 AM

కౌలుక

కౌలుకోలేని దెబ్బ

24 గంటలన్నారు.. 45 రోజులైనా

రాని ధాన్యం సొమ్ము

ఖరీఫ్‌ పెట్టుబడికి డబ్బుల్లేక

కౌలు రైతుల ఆందోళన

పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు

తీసుకోవడానికి అధికారుల నిరాకరణ

కన్నీటి పర్యంతమైన అన్నదాతలు

పిఠాపురం: ఖరీఫ్‌ సాగు మొదలైపోయింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో రైతులు పొలం బాట పడుతున్నారు. కానీ, చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు. అప్పు పుట్టడం లేదు. కౌలు చెల్లిస్తేనే భూమిలో అడుగు పెట్టాలని యజమానులైన రైతులు కరాఖండిగా చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో.. ముందస్తు సాగు చేయాలని, ప్రకృతి వైపరీత్యాల నుంచి పంటలు కాపాడుకోవాలని ఊదరగొడుతున్న ప్రభుత్వం.. తమకివ్వాల్సిన ధాన్యం సొమ్ము గురించి మాత్రం నోరు మెదపడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రబీ ధాన్యం విక్రయించిన రైతులకు జిల్లా వ్యాప్తంగా రూ.60 కోట్లు, పిఠాపురం నియోజకవర్గంలో సుమారు 250 మంది రైతులకు రూ.10 కోట్లకు పైగా ప్రభుత్వం బకాయి పెట్టింది. ఈ డబ్బులు ఇవ్వకపోతే ఖరీఫ్‌ సాగుకు పెట్టుబడి ఎక్కడి నుంచి తీసుకురావాలని ప్రశ్నిస్తున్నారు. గత రబీలో పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి సేకరించింది. ఇది జరిగి 45 రోజులైంది. అప్పుడే ఖరీఫ్‌ కూడా వచ్చేసింది. అయినప్పటికీ ప్రభుత్వం ధాన్యం సొమ్ము ఇవ్వడం లేదు. ఈ డబ్బులు వెంటనే ఇవ్వాలని కోరుతూ నియోజకవర్గానికి చెందిన పలువురు రైతులు పిఠాపురం ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీ (పాడా) కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్‌)లో తమ గోడు వెళ్లబోసుకున్నారు. దీనిపై అర్జీ ఇచ్చేందుకు వారు ప్రయత్నించగా కాగితం రూపంలో వద్దని, మామూలుగా చెప్పాలని అంటూ రైతుల నుంచి ఫిర్యాదు తీసుకునేందుకు అధికారులు నిరాకరించారు. దీంతో, రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. పండించిన ప్రతి ధాన్యం గింజా కొంటామని, 24 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని గొప్పలు చెప్పిన అధికారులు.. ఇప్పుడు అర్జీ తీసుకోవడానికి సైతం నిరాకరిస్తున్నారని, ఇక తమ బాధలు ఎవరికి చెప్పుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఇవ్వాల్సిన ధాన్యం సొమ్ము ఇవ్వకపోగా తిరిగి అప్పులు చేయాల్సిన దుస్థితిలోకి ప్రభుత్వం నెట్టేసిందని వాపోయారు. మరోవైపు అప్పులు కూడా పుట్టడం లేదని చెబుతున్నారు. ప్రభుత్వాన్ని నమ్మి కోలుకోలేని విధంగా దెబ్బ తిన్నామని కన్నీరు పెట్టుకుంటున్నారు.

మరో మూడు వారాలంటున్నారు

ఖరీఫ్‌ సీజన్‌ వచ్చేసింది. ధాన్యం సొమ్ము రావడానికి ఇంకా మూడు వారాలు పడుతుందంటున్నారు. ముందు కౌలు ఇస్తే తప్ప భూమిలోకి రావద్దని యజమాని అంటున్నాడు. అప్పు చేసి ఇద్దామంటే అప్పులు ఇచ్చే వారు కూడా లేరు. రబీలోనే ఆస్తులు తాకట్టు పెట్టి, అప్పులు తెచ్చి సాగు చేశాం. ధాన్యం సొమ్ము వస్తుందని, పెట్టుబడికి ఇబ్బంది ఉండదని అనుకున్నాం. కానీ అటు సొమ్ము రాక.. ఇటు పంట వేసే దారి లేక ఆస్తులు తాకట్టులో ఉండిపోయి వడ్డీలు పెరిగిపోతున్నాయి. వచ్చే సొమ్ము వడ్డీలకే సరిపోని పరిస్థితి ఏర్పడింది. ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకుంటే ధర తక్కువైనా వెంటనే సొమ్ము ఇచ్చేసేవారు. అలా అమ్మనీయకుండా అధికారులు వచ్చి మమ్మల్ని నమ్మించి, ఇప్పుడు నట్టేట ముంచారు.

– విజయకుమార్‌, కౌలు రైతు, గొల్లప్రోలు మండలం

ఇంత దారుణం ఎప్పుడూ చూడలేదు

రైతును ఇంత దారుణంగా ఇబ్బంది పెట్టడం ఎప్పుడూ చూడలేదు. ‘గంటల్లో మీ డబ్బు మీ ఇంటికి వస్తుంది’ అని గొప్పగా చెప్పారు. ప్రైవేటు వ్యాపారికి అమ్మితే చర్యలు తీసుకుంటామని భయపెట్టారు. ప్రభుత్వానికి అమ్మితే మాకు రక్షణగా ఉంటుందని నమ్మాం. తీరా ధాన్యం అమ్మి 45 రోజులైనా ఇదిగో అదుగో అంటున్నారు తప్ప డబ్బులు వేయడం లేదు. అప్పుడు మా దగ్గరకు వచ్చి ధాన్యం అమ్మాలని చెప్పిన ఏ అధికారీ ఇప్పుడు సమాధానం చెప్పడం లేదు. ఎవరిని అడగాలో తెలియడం లేదు. కనిపించిన ప్రతి ఆఫీసుకు, అధికారి వద్దకు తిరుగుతున్నాం. ఇప్పుడు సాగు పెట్టుబడికి డబ్బుల్లేవు. ఇక తాకట్టు పెట్టడానికి మా దగ్గర ఆస్తులూ లేవు. అప్పులు ఇచ్చేవారూ లేరు. అన్నం పెట్టే రైతును ఏడిపించడం ప్రభుత్వానికి తగదు.

– నాగేశ్వరరావు, కౌలు రైతు, గొల్లప్రోలు మండలం

నట్టేట ముంచారు

రైతులను నమ్మించి ప్రభుత్వం నట్టేట ముంచింది. రైతు సంక్షేమమే ధ్యేయమని చెప్పిన కూటమి నేతలు ఇప్పుడు సమాధానం చెప్పాలి. 24 గంటల్లో డబ్బులు వేస్తామంటూ తెగ గొప్పలు చెప్పిన నేతలు, అధికారులు ఇప్పుడు మాట్లాడటం లేదు. ఆరుగాలం కష్టపడి ఎండనక వాననక ఒళ్లు గుల్ల చేసుకుని అప్పు చేసి మరీ పెట్టుబడులు పెట్టి పండించిన పంటకు డబ్బులు ఇవ్వకపోతే రైతు ఎలా మళ్లీ పంట పండిస్తాడు? ఉన్న అప్పులకు వడ్డీలు పెరిగిపోతున్నాయని రైతులు వాపోతూంటే ఇంకా వాయిదాలు వేయడమేమిటి? ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాల వల్లే ఇలా జరుగుతోంది. రైతులకు వెంటనే ధాన్యం సొమ్ము చెల్లించాలి. లేకపోతే రైతుల తరఫున వైఎస్సార్‌ సీపీ ఉద్యమిస్తుంది. రైతులకు ఏమాత్రం అన్యాయం జరిగినా ఊరుకునేది లేదు.

– వంగా గీతా విశ్వనాథ్‌, మాజీ ఎంపీ, వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి, పిఠాపురం

కౌలుకోలేని దెబ్బ1
1/3

కౌలుకోలేని దెబ్బ

కౌలుకోలేని దెబ్బ2
2/3

కౌలుకోలేని దెబ్బ

కౌలుకోలేని దెబ్బ3
3/3

కౌలుకోలేని దెబ్బ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement