బాకాయి బాబుపై పోరు | - | Sakshi
Sakshi News home page

బాకాయి బాబుపై పోరు

Jun 23 2025 5:36 AM | Updated on Jun 23 2025 5:36 AM

బాకాయ

బాకాయి బాబుపై పోరు

ఉద్యోగాలు లేదా భృతి కోసం నిరుద్యోగులు..

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కోసం విద్యార్థులు

కూటమి ప్రభుత్వంపై దండెత్తుతున్న యువత

వారి పక్షాన కలెక్టరేట్‌ వద్ద

నేడు వైఎస్సార్‌ సీపీ ఆందోళన

సాక్షి ప్రతినిఽధి, కాకినాడ: ఓడ ఎక్కే దాకా ఓడ మల్లన్న.. ఒడ్డుకు చేరాక బోడి మల్లన్న అన్న సామెత చందంగా ఉంటుంది చంద్రబాబు తీరు. సార్వత్రిక ఎన్నికల్లో అధికారం కోసం ఎడాపెడా హామీలు గుప్పించేసి గద్దె నెక్కాక వాటిని గాలికి వదిలేయడం బాబుకు వెన్నతో పెట్టిన విద్య అని పలువురు అంటుంటారు. ఇందుకు నిదర్శనమే గత ఏడాది ఎన్నికల్లో యువత, విద్యార్థులకు ఆయన ఇచ్చిన హామీలు. వారికి ఎన్నో ఆశలు కల్పించి ఓట్లు కొల్లగొట్టారు. తీరా అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా వారి హామీల గురించిన ఆలోచనే ఆయనకు లేకపోవడం బాధాకరం. రారష్ట్‌రంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ఒక వేళ ఉద్యోగాలు ఇవ్వకుంటే నెలకు రూ.3000 నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. అంతకు ముందు 2014 ఎన్నికలలో కూడా ఇలానే నిరుద్యోగభృతి రూ.2000 ఇస్తామని చంద్రబాబు నమ్మించి మోసంచేశారు. అయినా ఈ సారైనా ఇవ్వకపోతారా అనే నమ్మకంతో ఓటేసిన పాపానికి ఏడాదైనా ఒక్క ఉద్యోగం కానీ, ఒక్క నెల నిరుద్యోగ భృతి కూడా ఇవ్వకుండా దగా చేశారని నిరుద్యోగ యువత ఆగ్రహంతో రోడ్డెక్కుతోంది. ఇచ్చిన హామీ అమలుచేస్తారేమో అని ఏడాది పాటు కళ్లలో ఒత్తులు వేసుకుని ఎదురుచూసినా మొండి చేయే చూపడంతో వారంతా సంఘటితమవుతున్నారు. నిరుద్యోగ యువతతో పాటు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందని విద్యార్థులకు వెన్నుదన్నుగా నిలిచేందుకు వైఎస్సార్‌ సీపీ యువజన, విద్యార్థి విభాగాలు ఉద్యమానికి సన్నద్ధమవుతున్నారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపును అందుకుని జిల్లాలోని పార్టీ విభాగాల ప్రతినిధుల ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్‌ వద్ద ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదల చేయకపోవడంతో కళాశాల యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికెట్‌లు ఇవ్వకుండా కాలేజీల నుంచి తిప్పి పంపేస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు, నిరుద్యోగులకు మద్దతుగా కాకినాడ కలెక్టరేట్‌ వద్ద తలపెట్టిన ఆందోళనకు పెద్ద ఎత్తున యువత తరలివచ్చేందుకు సిద్ధపడుతున్నారు.

కాకినాడ జిల్లాలో నిరుద్యోగులకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ కలిసి అక్షరాలా రూ.1800 కోట్లు బకాయిపడ్డారని లెక్కలు కడుతున్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. ఫలితంగా జిల్లాలో సుమారు ఐదు లక్షల పైచిలుకు నిరుద్యోగులకు ఒక్కటంటే ఒక్క నెల నిరుద్యోగ భృతి కూడా ఇచ్చిన దాఖలాలు లేకపోవడంపై వైఎస్సార్‌ సీపీ నిలదీయనుంది. వీరికి నెలకు రూ.150 కోట్లు వంతున నిరుద్యోగ భృతి ఇవ్వాల్సి ఉంది. ఉద్యోగాలు ఇచ్చే వరకు ఇస్తామన్న భృతిని లెక్కేస్తే జిల్లాలో ఒక్కో నిరుద్యోగికి రూ.3000 చొప్పున ఇవ్వాలి. కానీ ఎవరికీ పైసా కూడా విదల్చలేదు సరికదా.. ఆ ప్రస్తావన, ప్రతిపాదనలు సైతం చేయడం లేదు. మాటల గారడీతో ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిన చంద్రబాబుకు హామీలు అమలుచేయాలనే డిమాండ్‌తో కలెక్టరేట్‌ల వద్ద తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేయనున్నారు.

నిరుద్యోగులకు చేదోడుగా వైఎస్సార్‌ సీపీ

నాడు జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన పాదయాత్ర సందర్భంగా నిరుద్యోగులు ఆయనకు ఎదురువెళ్లి ఆదుకోవాలని వేడుకున్నారు. డిగ్రీలు, పీజీలు, ఎంటెక్‌లు చేసినా కనీసం చిరుద్యోగం కూడా లేదంటూ వారు కంటతడిపెట్టుకోవడంతో చలించిన జగన్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చారు. వర్గాలకు తావు లేకుండా పూర్తి పారదర్శకంగా గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శుల నియామకాలు చేపట్టారు. అలా ప్రతి పల్లె, పట్టణంలో వందలాది మంది యువతకు ఉద్యోగావకాశాలు కల్పించి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఉన్న 620 గ్రామ, వార్డు సచివాలయాల్లో 5324 మంది నిరుద్యోగులకు సచివాలయ ఉద్యోగులుగా నియమించిన విషయాన్ని ఈ సందర్భంగా యువత చర్చించుకుంటోంది.

జాబ్‌ క్యాలెండర్‌ లేక, నిరుద్యోగ భృతి అందక ఉన్నత చదువులు అభ్యసించిన యువత ఇరుగు, పొరుగు రాష్ట్రాలకు వలసబాట పడుతున్నారు. బీటెక్‌, ఎంటెక్‌, పీజీలు చదివినా యువకులు ప్రభుత్వ ఉద్యోగాలు లేక హైదరాబాద్‌, బెంగళూరు, చైన్నె, తదితర రాష్ట్రాలకు పొట్టచేత పట్టుకుని వెళ్లిపోతున్నారు. వందలాది మంది స్థానికంగానే ఉన్నా సరైన ఉద్యోగం లేక చిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. ప్రభుత్వ నిర్వాకంతో ఉద్యోగ అర్హత వయసు దాటిపోతోందని వారు ఆందోళన చెందుతున్నారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై కూటమి సర్కార్‌కు ఉలుకుపలుకు లేదు. పేద విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వస్తుందనే ఆశతో ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలల్లో చేరితే ఏడాదిగా ఆ నిధులు విడుదలచేయకుండా ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. దాని ప్రభావం విద్యార్థుల చదువులపై పడుతోంది. జిల్లాలో 19వేల పై చిలుకు విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కోసం ఎదురుచూస్తున్నారు. కూటమి సర్కార్‌ ఫీజు రీ ఎంబర్స్‌మెంట్‌ విడుదల చేయకపోవడంతో యాజమాన్యాలు తిప్పి పంపేస్తున్న పరిస్థితుల్లో విద్యార్థులు మానసికంగా కుంగిపోతున్నారు. ఈ పరిస్థితులన్నింటిపైనా ప్రభుత్వాన్ని మేల్కొలిపేందుకు వైఎస్సార్‌ సీసీ యువజన, విద్యార్థి విభాగాలు తమ వంతు బాధ్యతగా యువత, విద్యార్థులకు మద్దతుగా ఆందోళనకు సిద్ధమవుతున్నాయి.

రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా సోమమవారం ఉదయం 10 గంటలకు కార్యక్రమం ప్రారంభం కానుంది. జిల్లా నలుమూలల నుంచి తరలి వచ్చే యువత, విద్యార్థులు తొలుత వైఎస్సార్‌ సీపీ కాకినాడ సిటీ పార్టీ కార్యాలయానికి చేరుకోవాలని నిర్ణయించారు. అక్కడి నుంచి డీఎంహెచ్‌ఓ కార్యాలయం, జిల్లా పరిషత్‌ సెంటర్‌, ఆర్డీఓ కార్యాలయం మీదుగా కలెక్టరేట్‌ వరకు ర్యాలీగా వెళ్లి జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందచేయనున్నారు.

బీసీ యువత తరలిరావాలి

దగాపై పోరుకు బీసీ యువత తరలిరావాలి. కూటమి పార్టీలు సూపర్‌ సిక్స్‌తో పాటు 143 హామీలు ఇచ్చి మోసంచేశాయి. డైవర్షన్‌ రాజకీయాలతో కాలక్షేపం చేస్తూ నిద్ర నటిస్తున్న ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా తరలిరావాలి. బీసీ సెల్‌ అధ్యక్షులు, అనుబంధ విభాగాలలో వివిధ హోదాలలో నియమితులైన నాయకులు తరలిరావాలి. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వకుండా విద్యార్థులను ఇబ్బందులకు గురిచేయడం తగదు. దీని వల్ల కాలేజీల్లో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ప్రభుత్వం ఉదాసీనంగా ఉండడం సమంజసం కాదు. – అల్లి రాజబాబు, వైఎస్సార్‌ సీపీ బీసీ సెల్‌ అధ్యక్షుడు, కాకినాడ జిల్లా

అవిచ్చేస్తాం.. ఇవిచ్చేస్తాం.. అన్నీ ఇచ్చేస్తాం అంటూ బాకా ఊదేసి నమ్మించి ఆనక నట్టేట ముంచడం ముఖ్యమంత్రి చంద్రబాబుకు అలవాటే. ఇచ్చిన హామీల్లాగే యువతకు ఉద్యోగాలు, విద్యార్థులకు రీయింబర్స్‌మెంట్లు బకాయి పెట్టి మళ్లీ అదే బాకాతో ఊరేగుతూ ఓట్లు దండుకోవడం ఆయనకే చెల్లింది. పదే పదే అదే సాగుతుందనుకోవడం కుదరనే కుదరదు. పోరాడి మరీ ఇచ్చిన హామీలను ఆయన నుంచే గుంజుకుంటామని నిరుద్యోగ యువత, విద్యార్థులు కూటమి పాలనపై దండెత్తుతున్నారు. పోరుబాట పడుతున్నారు.

కాకినాడ కళాశాలల వివరాలు ఇవీ..

డిగ్రీ ప్రభుత్వ 08, ప్రైవేట్‌ 31

ఇంజినీరింగ్‌లో ప్రభుత్వ 01,ప్రైవేట్‌ 08

ఐటీఐ ప్రభుత్వ 02, ప్రైవేట్‌ 09

నర్సింగ్‌ కళాశాలలు 06

పాలిటెక్నిక్‌ 03, ప్రైవేట్‌ 04

మెడికల్‌ ప్రభుత్వ 01

బీఈడీ 06

ఏంబీఏ, ఎంసీఏ 07

మొత్తం కళాశాలలు 86

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు..

విద్యార్థుల సంఖ్య 19,650

బకాయిపడ్డ నగదు రూ.38.59కోట్లు

జిల్లా జనాభా 22,47,680

జిల్లాలో కుటుంబాలు 5,33,908

గ్రామీణప్రాంతాల్లో 16,36,389

పట్టణ ప్రాంతాల్లో 6,11,471

ఇంటికొక నిరుద్యోగి లెక్కన:

నిరుద్యోగులు: 5,00,000 (సుమారు)

ఒక్కొక్కరికి రూ.3000 వంతున నెలకు: రూ.150 కోట్లు

12 నెలలకు బకాయి: రూ.1800 కోట్లు

బాకాయి బాబుపై పోరు1
1/1

బాకాయి బాబుపై పోరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement