
రేపు యువత పోరు
● విజయవంతానికి నేతల పిలుపు
● పోస్టర్ ఆవిష్కరణ
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): యువత, విద్యార్థులకు ఇచ్చిన మాట తప్పిన కూటమి సర్కార్‌కు బుద్ధి వచ్చేలా తలపెట్టిన యువత పోరు ఆందోళనను విజయవంతం చేయాలని వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు రాగిరెడ్డి అరుణ్ కుమార్ (బన్నీ) పిలుపునిచ్చారు. పార్టీ యువజన, విద్యార్థి విభాగాలు సమన్వయం చేసుకుంటూ సోమవారం తలపెట్టిన యువత పోరును విజయవంతం చేయడం ద్వారా ప్రభుత్వం కళ్లు తెరిపించాలన్నారు. వైఎస్సార్ సీపీ నగర కార్యాలయంలో వైఎస్సార్ సీపీ యువత పోరు పోస్టర్‌ను అరుణ్‌కుమార్ ఆధ్వర్యాన పార్టీ యువ నేతలు శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బన్నీ మాట్లాడుతూ, ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం నిరుద్యోగ భృతిని విస్మరించిందన్నారు. నిరుద్యోగులకు తక్షణమే భృతి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోట శ్రీరాంజీ మాట్లాడుతూ, సూపర్ సిక్స్ హామీల అమలులో కూటమి ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఇంటికో ఉద్యోగం లేదా నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి హామీ కొండెక్కించారని సంయుక్త కార్యదర్శి ఎంజీకే కిషోర్ ఆక్షేపించారు. యువగళం పేరుతో మంత్రి నారా లోకేష్ ఎన్నికల సమయంలో ఏటా జనవరి 1న నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ఇస్తామన్న హామీ ఏమైందని సిటీ అధ్యక్షుడు రోకళ్ల సత్యనారాయణ, ఉలవల భూషణం ప్రశ్నించారు. కార్యక్రమంలో దాసం వెంకటేష్, కరణం భాను, వీరంరెడ్డి నాని, సకురు గుర్రాజు, తిరుమల శెట్టి లక్ష్మీకాంత్, సీడీ కుమార్ తదితరులు పాల్గొన్నారు.