తొలగని ఆంక్షలు

- - Sakshi

ఎలాంటి సౌకర్యాల్లేవు..

పునరావాస కేంద్రంలో ఎలాంటి సౌకర్యాలు లేవు. ప్లాట్లలో సైతం గుంతలున్నాయి. డబ్బులన్నీ గుంతలు పూడ్చుకునేందుకే సరిపోతాయి. ఇళ్లు కట్టుకునేందుకు సక్రమంగా లేని చోటికి ఎలా వెళ్లాలి.

– వీరేష్‌, చిన్నోనిపల్లె

న్యాయం చేయాలి

నిర్వాసితులకు 17 ఏళ్ల క్రితం ఎకరా భూమికి రూ.70 వేలు పరిహారంగా ఇచ్చారు. ఆ డబ్బులన్ని ఖర్చు చేసుకున్నాం. ఇప్పుడు ఎకరా భూమి రూ.20 లక్షలు పలుకుతుంది. ఈ రిజర్వాయర్‌ వలన ఎవరికి ఎలాంటి ఉపయోగం లేదు. రిజర్వాయర్‌ను రద్దు చేయాలి.

– రాముడు, చిన్నోనిపల్లె

ఎక్కడికి పోవాలి..

రిజర్వాయర్‌ పనులు ప్రారంభించే సమయంలో నేను 6వ తరగతి చదువుకునే వాణ్ని. ఇప్పుడు నాకు 24 ఏళ్లు. 17 ఏళ్ల తర్వాత రిజర్వాయర్‌ను పూర్తి చేస్తాం ఖాళీ చేయమంటే ఎక్కడికి పోవాలి. మాకు ఇప్పటికి ఇండ్ల పట్టాలు లేవు. పునరావాస కేంద్రంలో సౌకర్యాలు కల్పించాలి. – గోపినాథ్‌, చిన్నోనిపల్లె

చిన్నోనిపల్లి చుట్టూ పహారా కాస్తున్న పోలీసులు

కలెక్టర్‌ను కలిసేందుకు వెళ్తున్న ఇందువాసి గ్రామస్తులతో మాట్లాడుతున్న ఎస్‌ఐలు

గట్టు: చిన్నోనిపల్లిలో ఆంక్షలు తొలగలేదు. పోలీసుల ఆంక్షల నేపథ్యంలో గ్రామంలోని వారెవరూ ఇంటి నుంచి వీధుల్లోకి వచ్చేందుకు జంకుతున్నారు. ఇళ్లలోనే బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. సోమవారం సైతం పోలీస్‌ బలగాల మెహరింపు నడుమ రిజర్వాయర్‌ పనులు కొనసాగాయి. ఇతర గ్రామాల నుంచి చిన్నోనిపల్లె వైపునకు వెళ్లే దారులన్నింటిలో బారీకేడ్లతో పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. కొత్తవారిని గ్రామం వైపు అనుమతించడం లేదు. ఎవరైనా వెళ్లినా వారి పూర్తి వివరాలు, వీడియో తీసుకున్న తర్వాతే అనుమతిస్తున్నారు. మీడియాను సైతం గుర్తింపు కార్డులు పరిశీలించిన తర్వాతే చిన్నోనిపల్లె వైపునకు వెళ్లడానికి పోలీసులు అనుమతిస్తున్నారు. మొత్తం మీద చిన్నోనిపల్లి గ్రామాన్ని నిశ్శబ్ధం రాజ్యమేలుతోంది. మగవారిని అందరినీ పోలీసులు అదుపులోకి తీసుకోగా.. వృద్ధులు, యువకులు, పిల్లలు పనులన్నింటిని వదిలేసి ఇళ్ల దగ్గరే ఉండిపోయారు.

చకచకా రిజర్వాయర్‌ పెండింగ్‌ పనులు

సోమవారం చిన్నోనిపల్లె రిజర్వాయర్‌ కట్ట పనులు జోరందుకున్నాయి. 625 మీటర్ల మేరకు రిజర్వాయర్‌ కట్ట నిర్మాణం పనులు మిగిలిపోగా, ఆ పనులను పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టారు. గద్వాల ఆర్డీఓ రాములు, డీఎస్పీ రంగస్వామి, తహసీల్దార్లు సుబ్రమణ్యం, జుబేర్‌ అహ్మద్‌లతో పాటుగా ఇంజనీరింగ్‌ అధికారులు దగ్గరుండి పనులు పర్యవేక్షిస్తున్నారు. వాగు దగ్గర వదిలేసిన రిజర్వాయర్‌ కట్ట గ్యాప్‌ను పూర్తి చేయడంతో పాటుగా స్లూయిజ్‌, అలుగు పనులు పూర్తి చేస్తే రిజర్వాయర్‌ పనులు వంద శాతం పూర్తయినట్లే అని సాగు నీటి శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం చిన్నోనిపల్లె వాగు దగ్గర వదిలేసిన గ్యాప్‌ను పూడ్చితే వానాకాలంలో చిన్నోనిపల్లె, ఇందువాసి వాగుల నుంచి వచ్చిన వర్షపు నీటితో రిజర్వాయర్‌ నీరు గ్రామంలోకి వచ్చి చేరతాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నిరసనకారుల్లో ఆరుగురి విడుదల

రిజర్వాయర్‌ను రద్దు చేయాలంటూ నిరసన దీక్షలు చేపట్టిన చాగదోన, చిన్నోనిపల్లె, లింగాపురం, ఇందువాసి, బోయలగూడెం నిర్వాసిత రైతులను శనివారం అర్ధరాత్రి పోలీసులు అదుపులోకి తీసుకోగా.. రెండు రోజులుగా వారి అదుపులోనే ఉన్నారు. అయితే, వయస్సు, ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఆరుగురిని వదిలేసినట్లు తెలిసింది. మిగతా వారు పోలీసుల అదుపులో ఉండిపోయారు.

కలెక్టర్‌ను కలిసేందుకు ప్రయత్నం

చిన్నోనిపల్లె రిజర్వాయర్‌లో భూములను కోల్పోతున్న ఇందువాసి గ్రామానికి చెందిన నిర్వాసిత కుటుంబాలకు చెందిన రైతులు పెద్ద ఎత్తున సోమవారం కలెక్టర్‌ను కలిసిందేకు ప్రత్యేక వాహనంలో తరలి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐలు మంజునాథరెడ్డి, పవన్‌కుమార్‌ పోలీస్‌ సిబ్బందితో అక్కడికి వెళ్లి వారితో మాట్లాడారు. కొద్ది మంది మాత్రమే వెళ్లి కలెక్టర్‌ను కలసి వినతి పత్రం ఇవ్వాలని, వివాదాలు సృష్టస్తే మాత్రం ఇబ్బంది పడాల్సి వస్తుందని సూచించారు. దీంతో కొద్ది మంది మాత్రమే కలెక్టర్‌ను కలిసేందుకు వెళ్లారు.

ఆయకట్టు లేదనేది అవాస్తవం: ఆర్డీఓ, డీఎస్పీ

చిన్నోనిపల్లి నిర్వాసిత రైతులను తాము ఎలాంటి ఇబ్బందులకు గురి చేయడం లేదని గద్వాల ఆర్డీఓ రాములు, డీఎస్పీ రంగస్వామి తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రిజర్వాయర్‌ బ్యాలెన్స్‌ పనులు పూర్తి చేయిస్తున్నట్లు తెలిపారు. చిన్నోనిపల్లె రిజర్వాయర్‌ ద్వారా 12,500 ఎకరాలకు ఆర్డీఎస్‌ లింకుతో నీటిని అందించనున్నట్లు, కాల్వల ద్వారా మరో 3వేల ఎకరాలకు నీటిని అందిస్తున్నట్లు తెలిపారు. రిజర్వాయర్‌లో నీటి నిల్వ ఉండడం వలన చుట్టు పక్కల భూగర్భ జలాలు పెరుగుతాయని, రిజర్వాయర్‌ కింద ఆయకట్టు లేదనేది వాస్తవం కాదని ఆర్డీఓ తెలిపారు. ఆందోళన చేస్తున్న రైతులపై తాము కేసులు పెట్టి, అరెస్టులు చేయడం లేదని, ముందస్తు చర్యల్లో భాగంగా కొంత మందిని అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ రంగస్వామి తెలిపారు.

పోలీస్‌ బలగాల మధ్య కొనసాగిన చిన్నోనిపల్లి రిజర్వాయర్‌ పనులు

బిక్కుబిక్కుమంటున్న

నిర్వాసిత కుటుంబాలు

గ్రామ నలుదిక్కులా చెక్‌పోస్టులు

పోలీసుల అదుపులోనే 17మంది..

Read latest Jogulamba News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top