
సాగు లక్ష్యాలను చేరుకోవాలి
భూపాలపల్లి రూరల్: ఉద్యాన పంటల సాగు లక్ష్యాలను చేరుకోవాలని జాయింట్ డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ సంగీత లక్ష్మి అధికారులకు సూచించారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాల పురోగతిపై సమీక్షించేందుకు జాయింట్ డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ సంగీత లక్ష్మి జిల్లా మీటింగ్ హాల్‌లో భూపాలపల్లి, ములుగు జిల్లా ఉద్యాన శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో మైక్రో ఇరిగేషన్, సమగ్ర ఉద్యాన పంటల అభివృద్ధి పథకం, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకం, ఆయిల్ పామ్ విస్తరణ, పందిరి కూరగాయల సాగు తదితర పథకాల అమలు పురోగతిపై అంశాలవారీగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జేడీ సంగీత లక్ష్మి మాట్లాడుతూ ఆయిల్ పామ్‌లో పురోగతిని ప్రభుత్వం ప్రతి వారం గమనిస్తోందన్నారు. అధికారులు అధిక జాగ్రత్త వహించి లక్ష్యాలను చేరుకోవాలని తెలిపారు. రైతులకు వేగవంతంగా డ్రిప్పు పరికరాల అందజేత, సాగు మార్గదర్శకాలు, మద్దతు పరికరాలు అందించాలన్నారు. అనంతరం కలెక్టర్ రాహుల్ శర్మను కలిసి ప్రభుత్వం ఉద్యాన శాఖ పథకాలపై అవలంబిస్తున్న తీరు, పురోగతిపై కలెక్టర్‌తో చర్చించారు. ఈ సమావేశంలో జిల్లా ఉద్యాన శాఖ అధికారి ఎ.సునీల్‌కుమార్, ములుగు జిల్లా ఉద్యాన శాఖ అధికారి డి.సంజీవరావు, ఉద్యాన అధికారులు శ్రీకాంత్, లావణ్య మణి, డ్రిప్ కంపెనీ ప్రతినిధులు రహీం సుదర్శన్ రాజు శ్యామ్, కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.
జాయింట్ డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్
సంగీత లక్ష్మి