
టోల్ ఫీజు మినహాయించాలని ఆందోళన
కాటారం: టోల్ ఫీజు నుంచి మినహాయించాలని డిమాండ్ చేస్తూ కాటారం మండలం మేడిపల్లి టోల్‌గేట్ వద్ద కార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం కారు ఓనర్లు, డ్రైవర్లు ఆందోళన చేపట్టారు. టోల్‌గేట్ ఎదుట నిలబడి వాహనాలను నిలిపివేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు కారు ఓనర్లు, డ్రైవర్లు మాట్లాడుతూ కాటారం మండల కేంద్రం టోల్‌గేట్‌కు పది కిలోమీటర్ల దూరంలో ఉందని.. అయినప్పటికీ టోల్‌గేట్ నిర్వాహకులు తమ వద్ద టోల్‌ఫీజు వసూలు చేస్తున్నారని అన్నారు. ప్రతీ రోజు ఈ టోల్‌గేట్ ద్వారా పలుమార్లు ప్రయాణం చేస్తున్నామని.. టోల్ చెల్లించడం భారంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. టోల్‌గేట్ నిబంధనల ప్రకారం 20 కిలో మీటర్ల పరిధిలోని వాహనాలకు టోల్ తీసుకోవద్దని.. అయినప్పటికీ నిర్వాహకులు టోల్ బాదుతున్నారని ఆరోపించారు. తమ వాహనాలకు టోల్ చెల్లింపు నుంచి మినహాయింపు వర్తింపు చేయాలని కోరారు. సుమారు రెండు గంటల పాటు జరిగిన కారు యజమానులు, డ్రైవర్ల ఆందోళనతో టోల్‌గేట్‌కు ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. పోలీసులు ఆందోళన వద్దకు చేరుకొని కారు అసోసియేషన్ నాయకులతో మాట్లాడారు. నిర్వాహకులతో మాట్లాడి సమస్య పరిష్కరించుకోవాలని సూచించగా ఆందోళన విరమించారు.