
పత్తికి ప్రాణం
భూపాలపల్లి: నాలుగు రోజులుగా కురుస్తున్న వానలు పత్తి పంటకు ప్రాణం పోశాయి. కురవాల్సిన దానికంటే తక్కువ వర్షాలే కురుస్తున్నప్పటికీ పత్తి మొలకలు ఎండిపోయే దశలో వరుసగా వర్షాలు పడుతుండటంతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది.
ముందే కురిసి.. ముఖం చాటేసి..
జిల్లాలో మే నెల చివరి వారంలో వర్షాలు దంచికొట్టాయి. దీంతో ఈసారి వ్యవసాయ సీజన్ ముందే ప్రారంభం అవుతుందని అందరూ భావించారు. జూన్ మొదటి వారంలో కూడా అడపాదడపా వర్షాలు కురియడంతో కొందరు రైతులు దుక్కులు దున్ని సిద్ధం చేసుకోగా, మరికొందరు పత్తి గింజలు నాటారు. అనంతరం వర్షాలు మొఖం చాటేశాయి. దీంతో రైతులంతా ఆందోళన చెందారు. ఈ క్రమంలోనే జూన్ మూడో వారంలో మేఘాలు మురిపించి, చివరి వారం నుంచి వర్షాలు ప్రారంభం కావడంతో రైతుల్లో హర్షాతిరేఖాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా గతంతో పోలిస్తే ప్రస్తుతం వర్షాపాతం తక్కువగానే నమోదు అవుతుంది. సాధారణ వర్షాపాతంలో సగం మాత్రమే కురుస్తుంది. దీంతో మరిన్ని వర్షాలు కురిస్తేనే చెరువులు, కుంటలు, రిజర్వాయర్లలో జలకళ సంతరించుకుంటుంది.
పత్తికి అనుకూలంగా..
సరిగ్గా నెల రోజుల క్రితం సాగు ప్రారంభించిన భూముల్లో పత్తి పంట మొలక దశలో ఉంది. వర్షాలు లేకపోవడంతో వాటిని కాపాడుకునేందు కు రైతులు నానాపాట్లు పడ్డారు. పలుచోట్ల పత్తి మొలకలు ఎండిపోయాయి. అయితే వారం రోజు లుగా కురుస్తున్న వర్షాలు పత్తి పంటకు ప్రాణం పోస్తున్నాయి. ప్రతీరోజు వర్షం కురుస్తుండటంతో రైతులు పత్తి పంటలో పోగుంటలు (మొలవని చోట మళ్లీ గింజలు నాటడం) పెడుతున్నారు.
బోర్ల కింద వరిసాగు మొదలు
వర్షాలతో భూగర్భ జల నీటిమట్టం పెరగడం, బోర్లలో నీరు ఉండటంతో బోర్ల కింద వరిసాగు ప్రారంభించారు. బోరు సౌకర్యం ఉన్న రైతులు ఇ ప్పటికే వరినారు పోయగా, మరో పక్షం రోజుల్లో వరి పైరు నాటేందుకు సిద్ధమవుతున్నారు. చెరువులు, కుంటల్లో నీటిమట్టం పెరిగితే వరిసాగు విస్తీర్ణం మరింత పెరిగే అవకాశం ఉంది.
జిల్లాలో ప్రధాన పంటల సాగు అంచనా(ఎకరాల్లో)...
జిల్లావ్యాప్తంగా కురిసిన వర్షపాతం(మి.మీలో)
జూన్ 25న 112.4
జూన్ 26న 85.8
జూన్ 29న 215.4
జూన్ 30న 93.6
జూలై 1న 197.6
వానలతో కోలుకుంటున్న పత్తిచేలు
జిల్లాలో 4 రోజులుగా కురుస్తున్న వర్షాలు
సాధారణ వర్షపాతం కంటే
తక్కువే నమోదు

పత్తికి ప్రాణం