
మా ఊరికి ప్రైవేట్ స్కూల్ బస్సులు రావొద్దు
● అడ్డుకున్న గ్రామస్తులు
రేగొండ: మండలంలోని తిరుమలగిరిలో బుధవారం ప్రైవేట్ స్కూళ్ల బస్సులను గ్రామస్తులు అడ్డుకున్నారు. తమ ఊరిలోకి ప్రైవేట్ స్కూల్ బస్సులు రావొద్దని, ఉదయం స్కూల్ బస్సులు వచ్చే సమయానికి గ్రామంలోని చౌరస్తా వద్ద గుమికూడిన కొందరు గ్రామస్తులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య లభిస్తుందని అన్నారు. గ్రామానికి ప్రైవేట బస్సులు రావడం వల్ల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థుల సంఖ్య తగ్గి మూతపడే పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రైవేట్ పాఠశాలలకు పంపించి డబ్బు వృథా చేసుకోవద్దని సూచించారు. గ్రామంలోని పిల్లలందరినీ స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాలని తల్లిదండ్రులను కోరారు. అడ్డుకున్న వారిలో జెడ్పీహెచ్‌ఎస్ చైర్మన్ ఊకంటి నిర్మల, ప్రైమరీ స్కూల్ చైర్మన్ వసంత, గ్రామస్తులు నిమ్మల విజేందర్, జున్నుపాల కుమారస్వామి, ఆకుతోట తిరుపతి, సుంకరి శ్రీధర్, లాంసాని శివ, సతీష్, సురేష్, శివశంకర్, తదితరులు ఉన్నారు.