
వాంతులు చేసుకుంటున్న కూలీలు
వెంకటాపురం(కె): ములుగు జిల్లా వెంకటాపురం (కె) మండలం ఉప్పేడు గొల్లగూడెం గ్రామంలో మిర్చి తోటలోకి కూలి పనులకు వెళ్లిన 25 మంది కూలీలు కలుషిత నీరు తాగి అస్వస్థతకు గురైన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం... ఉప్పేడు గొల్లగూడెం గ్రామానికి చెందిన 25 మంది కూలీలు గ్రామ సమీపంలోని మిర్చి తోటలో కూలి పనులకు వెళ్లారు. మధ్యాహ్నం సమయంలో కూలీలు భోజనం చేసిన అనంతరం డ్రిప్ పైప్ నుంచి వచ్చే నీటిని తాగారు. అయితే డ్రిప్ పైపులు శుభ్రం చేసేందుకు రైతులు ఓ ద్రావకాన్ని వదిలారు. ఆ విషయం తెలియని కూలీలు నీరు తాగడంతో వాంతులు చేసుకుని అస్వస్థతకు గురయ్యారు. గమనించిన గ్రామస్తులు ఆటో వెంకటాపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స నిర్వహించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఏటూరునాగారం ఆస్పత్రికి తరలించారు.