
వివరాలు వెల్లడిస్తున్న డీసీపీ సీతారాం
జనగామ: ఏపీ, ఒరిస్సా రాష్ట్రాల నుంచి గంజాయి స్మగ్లింగ్ చేస్తూ జిల్లాలో అమ్మకాలు చేస్తున్న ఆరుగులు వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీసీపీ పి. సీతారాం తెలిపారు. బుధవారం డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ దేవేందర్‌రెడ్డి, నర్మెట సీఐ నాగబాబు, ఎస్సై ఎస్‌కె జానీపాషాతో కలిసి వివరాలు వెల్లడించారు. వరంగల్ కరీమాబాద్‌కు చెందిన కూకట్ల నిశాంత్, గోవిందరాజుల గుట్టకు చెందిన బొల్లి లక్ష్మణ్, భూపాలపల్లికి చెందిన మహ్మద్ అజహర్, తొగరి నిఖిల్, తొర్రూరు మండలం మడిపల్లికి చెందిన సిరబోయిన కృష్ణ, మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురుకు చెందిన చీకటి కిరణ్‌లు కలిసి రెండు రాష్ట్రాల మీదుగా వరంగల్, జనగామ ప్రాంతాలకు గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నారు. జనగామ జిల్లా తరిగొప్పులకు చెందిన మహ్మద్ జలీల్‌తో కలిసి నిశాంత్ గంజాయి అమ్మకాలు చేసే వారు. ఇటీవల జలీల్ పోలీసులకు పట్టుబడి జైలుకు వెళ్లడంతో బుల్లి లక్ష్మణ్, అజహర్‌తో కలిసి నిశాంత్ సులభతరంగా డబ్బులు సంపాదించాలనే అత్యాశతో జిల్లాలోని అనేక ప్రాంతాల్లో గంజాయి సప్లయ్ చేస్తున్నారు. నెల్లికుదురుకు చెందిన కృష్ణమూర్తి, కిరణ్‌పై వరంగల్, మహబూబాబాద్, ఖమ్మంలో గంజాయి కేసులు నమోదు కావడంతో పోలీసుల కళ్లు కప్పి వారి మకాం జనగామకు మార్చుకున్నారు. గంజాయి రవాణా చేస్తున్నారనే పక్కా సమాచారం మేరకు నర్మెట మండల కేంద్రం హెచ్‌పీ, ఏసర్ పెట్రోలు బంకులు, దుర్గమ్మ ఆలయం సమీపంలో పోలీసులు వేర్వేరుగా తనిఖీలు చేపట్టగా వాహనాలపై వెళ్తున్న ఆరుగురు వ్యక్తులపై అనుమానం వచ్చి తనిఖీలు చేయగా వీరి నుంచి రూ.1.20 లక్షల విలువ చేసే ఆరు కిలోల గంజాయి, మూడు సెల్ ఫోన్లు, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నామన్నారు. గంజాయి స్మగ్లర్లను పట్టుకున్న సీఐ నాగబాబు, ఎస్సై జానీపాషా, హెడ్ కానిస్టేబుల్ గట్టయ్య, కానిస్టేబుళ్లు ధనుంజయ్, ప్రవీణ్, రహమత్‌అలీ, హమీద్, రాజు, రమేష్, గాలిబ్‌లను డీసీపీ అభినందించారు.