
జనగామ రూరల్: పండుగలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఏసీపీ కొత్త దేవేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం జనగామ పోలీస్‌స్టేషన్‌లో నిర్వహించిన పీస్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. శ్రీరామనవమి, హనుమాన్ జయంతి, రంజాన్ పండుగలను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మతసామరస్యంతో జరుపుకోవాలన్నారు. సమావేశంలో సీఐ శ్రీనివాస్, హిందు సంఘాలు, ముస్లిం మైనార్టీ నాయకులు పాల్గొన్నారు.
కరెన్సీపై అంబేడ్కర్ ఫొటో ముద్రించాలి
జనగామ రూరల్: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేడ్కర్ ఫొటోను ఇండియా కరెన్సీపై ముద్రించాలని రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణ య్య, ఫొటో సాధన సమితి జాతీయ అధ్యక్షుడు జేరుపోతుల పరశురామ్ కోరారు. ఈ మేరకు వారు బుధవారం పార్లమెంట్ భవనంలో ఉపరాష్ట్రపతి జగదీప్ దంగల్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కరెన్సీ నోట్లపై అంబేడ్కర్ ఫొటో ముద్రించాలని ఈ పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు పెట్టాలని, రాజ్యసభ సభ్యులతో పోరాడుతామని అన్నారు. మార్చి 31న జంతర్‌మంతర్ వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయాలని కోరారు.
పంచాంగం ఆవిష్కరణ
జనగామ రూరల్: బ్రహ్మశ్రీ రాళ్లబండి లంకేశ్వరాచార్య సిద్ధాంతి చేత సూర్యసిద్ధాంతం ఆధారంగా గణించిన శోభకృత్ నామ సంవత్సర వైశ్యకర్మణ్య పంచాంగాన్ని బుధవారం విశ్వబ్రాహ్మణ కవులు, కళాకారులు ఆవిష్కరించారు. పట్ట ణంలోని పాటు బీటు బజార్‌లోని విశ్వకర్మ స్వర్ణకార సంఘం భవనంతో జరిగిన ఈ కార్యక్రమంలో కవులు సోమేశ్వరాచారి, రామ్మూర్తి, సోమనర్సింహాచారి, శశిధర్, సాయికిరణ్, వేధాస్ జిల్లా బాధ్యులు భాస్కరాచారి, నామేశ్వరాచారి, నర్సింహాచారి, అంజనేయులు పాల్గొన్నారు.
కాయకల్ప బృందం సందర్శన
జనగామ: జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని బుధవారం కాయకల్ప బృందం సందర్శించింది. టీంలోని డాక్టర్లు పూజారి రఘు, రెహమాన్, ఉస్మానియా అసిస్టెంట్ ప్రొఫెసర్ సిస్టర్ స్టెల్లా ఆస్పత్రిలోని శానిటేషన్ తదితర విభాగాలను పరిశీలించారు. క్వాలిటీ కంట్రోల్ నిబంధనలకు తగినట్టు ఉన్నాయా లేదా అనే కోణంలో కేటగిరీల వారీగా వివరాలు నమోదు చేసుకున్నారు. వారి వెంట మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సుగుణాకర్‌రాజు తదితరులున్నారు.
టీపీఓగా వేణుగోపాల్
జనగామ : పట్టణ ప్రణాళిక అధికారిగా వేణుగోపాల్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఉన్న రంగు వీరస్వామిని జిల్లా ప్రణాళిక అధికారిగా నియమించిన ప్రభుత్వం.. పూర్తి స్థాయి టీపీఓను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.


