అమెరికా ‘రు(ర)ణ’ రాజకీయం!

Janet Yellen warns US could again hit debt limit on Dec 15 - Sakshi

అమెరికా రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. దేశం అప్పులు.. వాటి చెల్లింపులను అడ్డుపెట్టుకుని ఆడుతున్న రాజకీయ నాటకం ఇంకొన్ని వారాలపాటు సాగనుంది. ఆర్థిక శాఖ మంత్రి జానెట్‌ ఎల్లెన్‌ తాజా ప్రకటనను బట్టి పరిమితిని సకాలంలో పెంచకపోతే డిసెంబరు 15వ తేదీ తరువాత అగ్రరాజ్యం అమెరికా చరిత్రలోనే తొలిసారి రుణ వాయిదాలను చెల్లించలేని పరిస్థితి ఎదుర్కోనుంది. అమెరికాకు అప్పులేంటి? చెల్లించ లేకపోవడం ఏమిటని ఆశ్చర్యపోనవసరం లేదు. ఎంత చెట్టుకు అంత గాలి అంటారు కదా.. అలాగే ఇదీనూ. కాకపోతే ఇక్కడ సమస్య డబ్బుల్లేకపోవడం కాదు. అప్పులపై ఉన్న పరిమితిని పెంచితేగానీ ప్రభుత్వం తన మాట నిలబెట్టుకునే పరిస్థితి లేకపోవడం!!

పెంచకపోతే ఏమవుతుంది?
రుణ పరిమితిని పెంచకపోతే అమెరికా తొలిసారి తాను చెల్లించాల్సిన రుణ వాయిదాలను చెల్లించలేని పరిస్థితి ఏర్పడుతుంది. అక్టోబరులో ఈ మొత్తం దాదాపు 28 లక్షల కోట్ల డాలర్ల వరకూ ఉంది. సకాలంలో రుణ వాయిదా చెల్లించకపోవడం ప్రతి ప్రభుత్వ కార్యక్రమంపై ప్రభావం చూపుతుంది. రాష్ట్రాలకు అందే నిధులు తగ్గుతాయి. గోల్డ్‌మ్యాన్‌ శాక్స్‌ సంస్థ అంచనా ప్రకారం సకాలంలో రుణ పరిమితి పెంచని పక్షంలో అమెరికన్‌ కుటుంబాలకు ప్రభుత్వం నుంచి అందే ఆర్థికసాయంలో నలభైశాతం కోత పడే అవకాశం ఉంది. రక్షణ దళాల సిబ్బందికి పూర్తిస్థాయిలో, సకాలంలో వేతనాలు, ఫింఛన్ల వంటివి చెల్లించలేమని పెంటగాన్‌ అక్టోబరులోనే ఒక ప్రకటన జారీ చేసింది. వాయిదా చెల్లింపులో విఫలమైతే అంతర్జాతీయ మార్కెట్‌లో అమెరికా విశ్వసనీయత దెబ్బతింటుంది. వడ్డీ రేట్లు పెరిగే అవకాశమూ ఉంది. ఇవన్నీ కలగలిస్తే అమెరికా ఆర్థిక వ్యవస్థ  నష్టపోతుందన్నమాట. తాత్కాలిక ఉపశమనంగా 480 బిలియన్‌ డాలర్ల అదనపు రుణం తెచ్చుకోవడానికి అక్టోబరులో సెనేట్‌ ఒకే చెప్పింది.రుణపరిమితిని పెంచుకోవడానికి, రిపబ్లికన్లను ఒప్పించడానికి బైడెన్‌ యంత్రాంగం తీవ్రంగా శ్రమిస్తోంది.

ప్రతిపక్ష రిపబ్లికన్లు ఏమంటున్నారు?
వివాదానికి బాధ్యత డెమొక్రాట్లదేనన్నది రిపబ్లికన్ల వాదన. తమ మద్దతు లేకుండా కొత్త అంశాలపై డబ్బులు ఖర్చు పెట్టేందుకు డెమోక్రాట్లు ప్రయత్నిస్తున్నారని.. దాన్ని అడ్డుకుంటూండటం వల్లనే వారు నిస్పృహకు గురవుతున్నారని ఆరోపిస్తున్నారు. డెమోక్రాట్లు ఇంకోసారి ఏకపక్షంగా పన్నులు విధించడం, ఖర్చు పెట్టడాన్ని తాము అనుమతించేది లేదని మైనార్టీ నేత మిచ్‌ మెక్‌కానెల్‌ స్పష్టం చేశారు. తమ ఆర్థిక విధానాలను అమలు చేసేందుకు డెమొక్రాట్లు బడ్జెట్‌ సమీక్షను అడ్డుగా పెట్టుకుంటున్నారని, ఇంత చేయగలిగిన వాళ్లు రుణ పరిమితి పెంపుపై కూడా ఏదో ఒక చర్య తీసుకోవాలని అంటున్నారు.     – సాక్షి, నేషనల్‌ డెస్క్‌

డెమొక్రాట్ల వాదనలేమిటి?
రుణ పరిమితి పెంపును రిపబ్లికన్లు అడ్డుకోవడాన్ని అధ్యక్షుడు జో బైడెన్‌ తీవ్రంగా ఖండించారు. ప్రతిపక్షాలవి ద్వంద్వ ప్రమాణాలని, ప్రమాదకరమైనవని, అమర్యాదకరమైనవి కూడా అని విమర్శించారు. ఆర్థిక వ్యవస్థతో ఆటలాడుకుంటున్నాయన్నారు. అమెరికన్‌ సెనేట్‌లో దాదాపు 50 మంది డెమొక్రాట్లు (100 సభ్యులుండే అమెరికా ఎగువసభ సెనేట్‌లో 48 మంది డెమొక్రాట్లకు ఇద్దరు స్వంత్రుల మద్దతు ఉంది. మిగతా 50 మంది రిపబ్లికన్‌ పార్టీ సభ్యులు) ఉండగా... రుణ పరిమితిని పెంచేందుకు కనీసం మరో పది రిపబ్లికన్‌ ఓట్లూ అవసరమవుతున్నాయి. మొత్తం రుణాల్లో బైడెన్‌ హయాంలోనివి మూడు శాతం మాత్రమేనని, మిగిలినవన్నీ గత ప్రభుత్వాలవేనని డెమొక్రాట్లు అంటున్నారు. ట్రంప్‌ హయాంలో తాము మూడుసార్లు రుణ పరిమితి పెంపునకు సహకరించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.  

ఏమిటీ రుణ పరిమితి కథ?
అమెరికా ప్రభుత్వం వివిధ రూపాల్లో సేకరించే పన్నుల మొత్తం కంటే ఎక్కువ ఖర్చు పెడుతుంది. ఇందుకోసం అన్ని ప్రభుత్వాల మాదిరిగానే అప్పులు చేస్తుంది. ఈ వ్యవహారమంతా కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ ద్వారా నడుస్తుంది. అప్పుల కోసం అగ్రరాజ్యం విడుదల చేసే బాండ్లు ప్రపంచంలోనే అత్యంత విశ్వసనీయమైన పెట్టుబడులుగా భావిస్తారు. 1939లో అమెరికన్‌ పార్లమెంటు ప్రభుత్వం చేయగలిగే అప్పులపై ఒక పరిమితిని విధిస్తూ చట్టం చేసింది. అయితే అప్పటి నుంచి ఇప్పటివరకూ కనీసం వందసార్లు ఈ పరిమితిని పెంచుకున్నారు. అంటే.. అవసరాన్ని బట్టి మరిన్ని అప్పులు చేసేందుకు ఎప్పటికప్పుడు అవకాశం కల్పించుకున్నారన్నమాట. 

అయితే ఇలా పరిమితి పెంచుకోవాలన్న ప్రతిసారి కూడా దానిపై కాంగ్రెస్‌లోని ఇరు పక్షాల మధ్య చర్చోపచర్చలు జరుగుతాయి. చివరకు ఇరుపక్షాలు కొన్ని పట్టువిడుపులతో ఏకాభిప్రాయానికి రావడం పరిమితిని పెంచుకోవడం కద్దు. అయితే ఇటీవలి కాలంలో ఈ అంశం రాజకీయ రంగు పులుముకుంటోంది. 2013లోనూ రుణ పరిమితిని దాటేసే పరిస్థితి ఏర్పడింది. అధ్యక్షుడు బరాక్‌ ఒబామా వ్యయ ప్రణాళికను రిపబ్లికన్లు పూర్తిగా అడ్డుకున్నారు. అదేమాదిరిగా ఈ సారి కూడా రిపబ్లికన్లు రుణ పరిమితి అంశాన్ని అడ్డుపెట్టుకుని ఒక వివాదాన్ని సృష్టించారు. అయితే... ఇలాంటి విషయాలు చివరి నిమిషం వరకూ సాగడం.. చివరకు రాజీమార్గాలపై తెరవెనుక మంతనాలు, పట్టువిడుపులు, కొన్ని సవరణల తరువాత ఓకే కావడం చరిత్రలో
ఇప్పటివరకూ జరిగిన తంతు!    

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top