కరోనా సోకితే.. మాస్క్‌ చెప్పేస్తుంది!

Developing Face Mask That Can Detect COVID-19 Available Soon - Sakshi

కరోనా సోకినా చాలా మందిలో పెద్దగా లక్షణాలు కనిపించవు. వారు టెస్టులకు వెళ్లరు, కరోనా ఉన్నట్టు వారికే తెలియదు. కానీ అలాంటి వారి నుంచి ఇతరులకు వైరస్‌ సోకుతుంది. మరి ప్రత్యేకంగా టెస్టులేమీ అవసరం లేకుండా.. మనం పెట్టుకున్న మాస్కే కరోనా ఉందో లేదో గుర్తించగలిగితే చాలా మేలు కదా.. అలాంటి మాస్కులు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. మరి ఆ మాస్కులేమిటి? కరోనాను ఎలా గుర్తిస్తాయి? వంటి వివరాలు తెలుసుకుందామా?     
– సాక్షి సెంట్రల్‌ డెస్క్‌ 

సులువుగా పరీక్షించేందుకు.. 
కరోనా వ్యాప్తి మరింతగా పెరుగుతున్న నేపథ్యంలో.. దానిని సులువుగా గుర్తించడంపై ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్నారు. అందులో భాగంగా జపాన్‌లోని క్యోటో ప్రిఫెక్చురల్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్త యసుహిరో సుకమొటో నేతృత్వంలోని బృందం ప్రత్యేక మాస్కులపై దృష్టిపెట్టింది.

ఆస్ట్రిచ్‌ పక్షులు కరోనా వైరస్‌ను బలంగా ఎదుర్కొంటున్నాయని ఇటీవల గుర్తించిన నేపథ్యంలో.. దీనిని తమ పరిశోధనకు ఆధారంగా తీసుకుంది. ఆస్ట్రిచ్‌ పక్షి ‘యాంటీబాడీ’లను ఉపయోగించి.. కరోనాను గుర్తించగల మాస్కులను అభివృద్ధి చేసింది. 

యూవీ లైట్‌లో మెరుస్తూ.. 
సుకమొటో బృందం ఆస్ట్రిచ్‌ పక్షుల గుడ్లను తీసుకుని, వాటిల్లోకి బలహీనపర్చిన కరోనా వైరస్‌ను ఇంజెక్ట్‌ చేసింది. అందులో ఏర్పడిన యాంటీబాడీలను సేకరించింది. ఒక సన్నని ఫిల్టర్‌ (మాస్కు వంటి ఒక పొర)పై ఆ యాంటీబాడీలను స్ప్రే చేసి.. సాధారణ మాస్కులో అమర్చింది. కొందరు కరోనా రోగులకు ఈ మాస్కులు ఇచ్చి.. కొద్ది గంటల పాటు ధరించాలని సూచించింది. 

రోగులు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, శ్వాసించినప్పుడు విడుదలయ్యే కరోనా వైరస్‌.. ఈ మాస్కుల్లోని ఫిల్టర్‌పైకి చేరింది. ఆ ఫిల్టర్‌పై ఉన్న ఆస్ట్రిచ్‌ యాంటీబాడీలు కరోనా వైరస్‌ను గుర్తించి అతుక్కుపోయాయి.

శాస్త్రవేత్తలు కొద్దిగంటల తర్వాత రోగుల నుంచి ఆ మాస్కులను సేకరించారు. వాటిలోని ఫిల్టర్లపై.. యాంటీజెన్‌లకు అంటుకునే ఫ్లోరోసెంట్‌ డై (కాంతి పడితే మెరిసే పదార్థం)ను స్ప్రే చేశారు. తర్వాత ఆ మాస్కులపై అల్ట్రా వయోలెట్‌ (యూవీ) కాంతిని ప్రసరింపజేస్తే.. కరోనా వైరస్‌ ఉన్న  ప్రాంతాలన్నీ మెరుస్తూ కనిపించాయి. 

ఏడాదిలో అందుబాటులోకి.. 
ఈ మాస్కులను మరింతగా అభివృద్ధి చేస్తున్నామని.. స్ప్రే అవసరం లేకుండానే, కేవలం సెల్‌ఫోన్‌ లైట్‌ ఆధారంగా మెరిసేలా మార్చుతున్నామని పరిశోధనకు నే తృత్వం వహించిన సుకమొటో తెలిపారు. తక్కువ ఖర్చుతో ఎక్కడైనా కరోనా నిర్ధారణ పరీక్ష చేయడానికి ఈ మాస్కులు వీలు కల్పిస్తాయని.. ఈ విధానంలో కచ్చితత్వం కూడా ఎక్కువని వెల్లడించారు. త్వరలోనే వీటిని జపాన్‌లో ప్రవేశపెడతామని, ఏడాదికల్లా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తామని వివరించారు. అయితే దీని ధర ఎంత ఉంటుందన్నది వెల్లడించలేదు. 

ఆస్ట్రిచ్‌ ‘యాంటీబాడీ’ల స్పెషాలిటీ ఏంటి?
భూమ్మీద ప్రస్తుతం జీవించి ఉన్న పక్షి జాతుల్లో అతి పురాతనమైనవి ఆస్ట్రిచ్‌లు. ఈ క్రమంలోనే వాటిలో అత్యంత సమర్థవంతమైన రోగనిరోధక శక్తి అభివృద్ధి చెందింది. ముఖ్యంగా ఆడ ఆస్ట్రిచ్‌ పక్షులకు ఈ సామర్థ్యం మరింత ఎక్కువ.

భారీ సంఖ్యలో వైరస్‌లు, బ్యాక్టీరియాలకు అత్యంత వేగంగా యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయి. దీనిపై శాస్త్రవేత్తలు చాలాకాలంగా పరిశోధనలు చేస్తున్నారు. ఆస్ట్రిచ్‌ల యాంటీబాడీలను ఉపయోగించి.. వివిధ రోగాలకు వ్యాక్సిన్లు తయారు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.   

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top