చైనా దూకుడు: మరో అద్భుతానికి శ్రీకారం

China Unveils Prototype Superfast Floating Maglev Train With 620 kmph - Sakshi

బిజీంగ్‌: ప్రపంచంలోనే అధిక జనాభా కలిగిన డ్రాగన్‌ దేశం టెక్నాలజీలో తనకు తానే సాటి అనిపించకుంటూ దూసుకుపోతోంది. ఎప్పుడూ భిన్న ప్రయోగాలు చేస్తూ ప్రపంచ దేశాలకు సవాలు విసిరే చైనా మరో అద్భుతానికి శ్రీకారం చుట్టింది. ఇటీవల కృత్రిమ సూర్యూడిని తయారు చేసుకుని చైనా ప్రపంచ దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే. ఇది మరువక ముందే డ్రాగన్‌ దేశం ఆధునాతన సాంకేతికతను ఉపయోగించి గాల్లో తేలే రైలును ఆవిష్కరించింది. అంటే ఈ రైలు.. పట్టాలపై తేలుతూ గంటకు 620 కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. సౌత్‌వెస్ట్ జియటాంగ్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు రూపొందించిన ఈ రైలుకు చక్రాలు ఉండవు. మాగ్నెటిక్‌ లెవిటేషన్, హై టెంపరేచర్ సూపర్ కండక్టర్ టెక్నాలజీ (హెచ్‌టీఎస్)లో పురోగతి సాధించడం ద్వారా దీనికి రూపకల్పన చేసినట్లు చైనా శాస్త్రవేత్తలు వివరించారు. ప్రస్తుతం ఉన్న రైళ్లన్నింటికంటే వేగంగా ఈ రైలు దూసుకుపోతుందని వారు పేర్కొన్నారు. (చదవండి: చైనా దుస్సాహసం.. భారత్‌లో గ్రామం)

కాగా మాగ్నెటిక్ లెవిటేషన్ సాంకేతికత సాయంతో డిజైన్‌ చేసిన ఈ రైలు చక్రాలు లేకుండానే కేవలం ఆయస్కాంత శక్తి సాయంతో పట్టాలపై తేలుతూ దూసుకుపోతుంది. కానీ చూసే వారికి మాత్రం గాల్లో తేలుతూ నుడుస్తున్నట్లు కనిపిస్తుంది. గంటకు 620 కిమీల వేగంతో ప్రయాణించే ఈ ట్రైన్ లోపల ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ను తలపించేలా సీట్లు వాటి మధ్య ఏర్పాట్లు ఉంటాయి. అలాగే బోగీలో ఓ పేద్ద ఎల్ఈడీ టీవీ కూడా ఉంటుంది. అయితే గత బుధవారం ఆవిష్కరించిన ఈ రైలు నమూనాతో వీటిలోని లోటుపాట్లను పరీక్షించేందుకు, పనితీరును పరిశీలించేందుకు అవకాశం లభించిందని చైనా అధికారులు చెప్తున్నారు. ఇటువంటి వాటిని మాగ్లెవ్ రైళ్లు అంటారు. టెక్నాలజీకి మారుపేరుగా చెప్పుకునే జపాన్‌లో దశాబ్దాల క్రితమే ఇవి అందుబాటులోకి వచ్చాయి. జపాన్‌లో ఈ రైళ్లు గంటకు 320 కిమీల వేగంతో ప్రయాణిస్తాయి. (చదవండి: చైనా సంచలనం; సూర్యుడి ప్రతిసృష్టి!)

ఈ క్రమంలో అత్యాధునిక టెక్నాలజీలో తమకంటూ ఓ ముద్ర వేసుకుంటున్న డ్రాగన్ దేశం సాంకేతికత వాడకంలో జపాన్‌కు పోటీ పడుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల కృత్రిమ సూర్యుడిని తయారు చేసుకోగా.. ఇప్పుడు మాగ్లెవ్ రైళ్ల అభివృద్ధిపై దృష్టి పెట్టింది. అందుకే జపాన్‌లోని‌ మాగ్లెవ్‌ రైలుకు మించి గంటకు 620 కిమీల వేగంతో వెళ్లే రైళ్లను ఆవిష్కరించేందుకు చైనా ప్రయోగం చేస్తోంది. జనవరి 13న చైనా శాస్త్రవేత్తలు ఈ రైలు నమూనాను ఆవిష్కరించారు. అయితే పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి రావాలంటే దాదాపు 10 ఏళ్ల సమయం పడుతుందని శాష్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. తమ దేశంలోని వివిధ నగరాలను వేగవంతమైన ప్రయాణ సాధనాల ద్వారా అనుసంధానం చేయాలని డ్రాగన్‌ దేశం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే మ్యాగ్లెవ్ రైళ్లను అభివృధ్ధికి చైనా శ్రీకారం చుట్టింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top