రాణి వెడలె.. బై బై బోయింగ్‌ 747

Boeing last 747 has rolled out of the factory after a more than 50-years service - Sakshi

క్వీన్‌ ఆఫ్‌ స్కైస్‌కి ఘనమైన వీడ్కోలు 

చిట్ట చివరి కార్గో విమానాన్ని కొనుగోలు చేసిన అట్లాస్‌  

విమానయాన చరిత్రలో మహరాణిగా వెలుగొందిన బోయింగ్‌ 747 విమానం కథ కంచికి చేరింది. 50 ఏళ్లకు పైగా అద్భుతమైన సేవలతో అలరించిన ఈ విమానాల తయారీని బోయింగ్‌ నిలిపేసింది. చిట్టచివరి విమానం డెలివరీ కూడా తాజాగా జరిగిపోయింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 500 పై చిలుకు బోయింగ్‌ 747లు సేవలందిస్తున్నాయి. అవన్నీ పూర్తిగా మూలకు పడ్డ అనంతరం ఈ ముచ్చటైన మోడల్‌ శాశ్వతంగా చరిత్ర పుటల్లోకి జారుకుంటుంది...  

1968, సెప్టెంబర్‌ 30
అమెరికాలోని వాషింగ్టన్‌ ఎవెరెట్టెలో కంపెనీ ప్లాంట్‌
బోయింగ్‌ 747 మొట్టమొదటి విమానం రాచఠీవితో నిల్చొని ఉంది. భారీ రెక్కలతో ఇంద్రభవనంలా మెరిసిపోతున్న ఆ విమానాన్ని చూడానికి వేలాది మంది అక్కడికి తరలివచ్చారు. అంత పెద్ద విమానాన్ని అప్పటివరకు చూసి ఎరుగని జనం దానినో అద్భుతంలా చూడసాగారు. భవనం లాంటి విమానం అసలు గాల్లో ఎలా ఎగరగలదని చర్చించుకోవడం మొదలు పెట్టారు. అప్పట్నుంచి ఈ విమానం అంతర్జాతీయ ప్రయాణ రూపురేఖల్ని మార్చేసింది. అందుకే బోయింగ్‌ 747ని క్వీన్‌ ఆఫ్‌ స్కైస్‌ అని పిలుస్తారు.  

2023, ఫిబ్రవరి 1
55 సంవత్సరాల తర్వాత.. సరిగ్గా అదే స్థలం
ఆకాశానికి రాణిలాంటి బోయింగ్‌ 747కి సిబ్బంది ఘనమైన వీడ్కోలు పలికారు. చిట్టచివరి విమానాన్ని గురువారం అట్లాస్‌ ఎయిర్‌లైన్స్‌ సంస్థకు అందజేశారు. ప్రయాణికుల విమానంగా మొదలైన దాని ప్రస్థానం కార్గో విమానంగా ముగిసింది. వీటి తయారీ నిలిపివేస్తున్నట్టు 2020లోనే కంపెనీ ప్రకటించింది. వేలాది మంది ఉద్యోగులతో పాటు ఔత్సాహికులు ఈ వీడ్కోలు కార్యక్రమానికి తరలి వచ్చారు. అత్యంత శక్తి సామర్థ్యాలు కలిగిన విమానాన్ని మళ్లీ చూడలేమని బాధాతప్త హృదయంతో చర్చించుకున్నారు.

విమానమే ఒక ఇంద్రభవనం  
విమాన ప్రయాణాల చరిత్రలో బోయింగ్‌కి ముందు, బోయింగ్‌ తర్వాత అని స్పష్టమైన విభజన రేఖ గీయొచ్చు. గంటల తరబడి కూర్చొని దేశ విదేశాలకు వెళ్లే విమాన ప్రయాణాలు బోయింగ్‌ రాకతో అత్యంత సౌకర్యవంతంగా మారాయి. సువిశాలంగా ఉండే బోయింగ్‌ 747 ఎదుట ఇతర విమానాలు  ఒక మరుగుజ్జుగా మారాయి. ఒక్క మాటలో చెప్పాలంటే బోయింగ్‌ విమానం ప్రపంచాన్ని కుదించింది. కళ్లు చెదిరే సదుపాయాలతో వీవీఐపీ ప్రయాణికులు మోజు పడేలా 747 విమానాలు రూపుదిద్దుకున్నాయి. బార్లు, డైనింగ్‌ హాళ్లు, మూవీ స్క్రీన్లు, లగ్జరీ ఇంటీరియర్లు, లాంజ్‌లు, లివింగ్‌ రూమ్‌లు ఒకటేమిటి ఇదసలువిమానమా,  గాల్లో ఎగిరే ఇంద్రభవనమా అని అందరూ అవాక్కయ్యారు.  

తయారీ నిలిపివేత ఎందుకు?  
అన్ని రంగాల్లోనూ సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతోంది. బోయింగ్‌ విమానానికయ్యే ఇంధనం ఖర్చు చాలా ఎక్కువ. 2007లో ఏ380 ఎయిర్‌ బస్‌ వచ్చిన దాకా బోయింగ్‌ 747 ప్రభ వెలిగిపోతూనే ఉంది. చమురు రేట్లు ఆకాశాన్నంటుతూ ఉండడంతో బోయింగ్‌ 747 కొనుగోలు చేసే ఎయిర్‌లైన్స్‌ సంస్థలు కరువయ్యాయి. యూరప్‌కి చెందిన ప్రత్యర్థి కంపెనీ ఎయిర్‌బస్‌ తక్కువ చమురు ఖర్చుతో విమానాలు రూపొందించడంతో బోయింగ్‌ డిమాండ్‌ పడిపోయింది. ఏ ఎయిర్‌లైన్స్‌ కూడా కొనుగోలుకు ముందుకు రావడం లేదు. దీంతో 2020లో బోయింగ్‌ 747 విమానాల తయారీ నిలిపివేస్తున్నట్టుగా ప్రకటించింది.

ప్రత్యామ్నాయం ఏంటి ?
జంబో జెట్లతో చమురు ధరాభారం ఎక్కువగానే ఉన్నా అత్యంత పెద్ద విమానాన్ని రూపొందించడానికి బోయింగ్‌ ఎప్పట్నుంచో ప్రయత్నాలు చేస్తోంది.  రెండు ఇంజిన్లు ఉండే 776ఎక్స్‌ అని పిలిచే ఈ సరికొత్త జంబో జెట్‌ 2020లోనే మార్కెట్లోకి రావాల్సి ఉండేది. కానీ కరోనా, రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధ ప్రభావాలు పడడంతో  విమానాల తయారీ ఆలస్యమవుతోంది. 2025 నాటికి ఈ సరికొత్త విమానాలు తేవాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.

మొట్ట మొదటి విమానం ఇలా..!
బోయింగ్‌ 747 కంటే ముందు ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చిన 707 బోయింగ్‌ విమానం చాలా ఇరుగ్గా ఉండేది. సీట్ల మధ్య రాకపోకలు సాగించడానికి ఒక్కటే మార్గం ఉండేది. దీంతో విమాన ప్రయాణాలపై ప్రజలకి ఒక రకమైన వ్యతిరేకత నెలకొంది. బోయింగ్‌ 747 రెండు అంతస్తులుతో, నడిచి వెళ్లడానికి రెండు మార్గాలతో అత్యంత సువిశాలంగా ఉండేది. బోయింగ్‌ 707 విమానం 200 మంది కంటే తక్కువ మంది ప్రయాణికులతో ఏకబిగిన 3 వేల నాటికల్‌ మైళ్లు  ప్రయాణిస్తే,  400 మంది ప్రయాణికుల్ని మోసుకువెళుతూ బోయింగ్‌ 747 ఏకబిగిన 5వేల నాటికన్‌ మైళ్ల దూరం ప్రయాణించే సామర్థ్యం కలిగి ఉంది.  

ఎన్నో ప్రత్యేకతలు  

► మొట్టమొదటి విమానాన్ని పాన్‌ యామ్‌ సంస్థ  జనవరి 15, 1970లో కొనుగోలు చేసింది.  తొలిసారి నిర్మించిన 747 విమానం 225 అడుగుల పొడవు ఉంది. దాని తోకభాగం ఆరు అంతస్తుల భవనం ఎంత పొడవు ఉంటుందో అంత ఉండేది.  
► జంబో జెట్‌కి చమురు ఖర్చు ఎక్కువ కావడంతో డిజైన్‌ రూపొందించినప్పుడే కార్గో అవసరాలకు మార్చుకునే విధంగా రూపొందించారు. 3,400 బ్యాగేజ్‌లను తీసుకువెళ్లే సామర్థ్యం దీనికి ఉంది.  అదే ఈ విమానాలను ఇన్నాళ్లూ కాపాడుతూ వచ్చింది.  
► 1990లో తొలిసారిగా బోయింగ్‌ 747–200 విమానాన్ని అమెరికా అధ్యక్షుడు వాడే ఎయిర్‌ ఫోర్స్‌ వన్‌ విమానంగా మార్చారు.  
► ఇప్పటివరకు 1,574 విమానాలను తయారు చేశారు. ఇప్పటికీ 500 విమానాలు వాడుకలో ఉన్నాయి.  
► ప్రయాణికుల, రవాణాతో పాటు అవసరమైనప్పుడు అంతరిక్షం నుంచి రాకపోకలకి అనుగుణంగా ఈ విమానాన్ని ఆధునీకరించారు.  
► ఎయిర్‌ ఇండియా కూడా ఈ విమానాలను కొనుగోలు చేసి విస్తృతంగా వినియోగించింది. 1971లో తొలి విమానాన్ని కొనుగోలు చేసింది.

–సాక్షి, నేషనల్‌ డెస్క్‌    

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top