No Headline | Sakshi
Sakshi News home page

No Headline

Published Tue, May 7 2024 7:05 PM

-

సాక్షి, సిటీబ్యూరో: పార్లమెంట్‌ ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్‌ ఈ నెల 13న జరుగనుందని, దీనికోసం దాదాపు 14 వేల మంది సిటీ పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు నగర పోలీసు కమిషనర్‌ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. వీరికి అదనంగా 22 కంపెనీల కేంద్రం సాయుధ బలగాలు వస్తున్నట్లు ఆయన వివరించారు. సోమవారం బషీర్‌బాగ్‌లోని సీసీఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొత్వాల్‌ మాట్లాడుతూ ‘నగర కమిషనరేట్‌ పరిధిలో రెండు పార్లమెంట్‌ స్థానాలు (హైదరాబాద్‌, సికింద్రాబాద్‌) పూర్తిగా, మరో రెండు (మల్కాజ్‌గిరి, చేవెళ్ల) పాక్షికంగా వస్తాయి. నగర పోలీసు విభాగంలో ఉన్న 14 వేల మందితో పాటు కేంద్ర నుంచి వచ్చే 22 కంపెనీల సాయుధ బలగాలను పోలింగ్‌ రోజు బందోబస్తు కోసం వినియోగిస్తాం. ఇప్పటికే ఆరు కంపెనీలు రాగా.. మిగిలినవి వస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో మొత్తం 41 కంపెనీల కేంద్ర సాయుధ బలగాలు వచ్చాయి. ఇప్పుడూ ఆ స్థాయిలో కావాలనే ఉద్దేశంతో అదనపు బలగాల కోసం ప్రతిపాదనలు పంపాం. అవసరమైన స్థాయిలో టీఎస్‌ఎస్‌పీ, సీఏఆర్‌, ఏఆర్‌ బలగాలు వాడతాం. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం క్రిటికల్‌ పోలింగ్‌ స్టేషన్ల ఉన్న చోట్ల కేంద్ర బలగాలు మోహరిస్తాం. ఏఎస్డీగా పిలిచే ‘ఆబ్‌సెంట్‌, షిఫ్ట్‌, డెత్‌’ ఓటర్లు ఎక్కువగా ఉన్న వాటినీ క్రిటికల్‌ పోలింగ్‌ స్టేషన్‌గా గుర్తించాలని ఈ ఏడాది ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఓ వ్యక్తి రూ.50 వేలకు మించి తీసుకెళ్లొద్దు. అయితే నగరంలో ఉన్న ఆస్పత్రులు, ఇతర ఎమర్జెన్సీ సేవల వివరాలు పరిగణలోకి తీసుకుని ఆధారాలు చూపిస్తే రూ.లక్ష వరకు అనుమతిస్తున్నాం. అంతకు మించి ఉంటే స్వాధీనం చేసుకుంటాం’అని వివరించారు.

నగర సీపీ శ్రీనివాస్‌రెడ్డి

 
Advertisement
 
Advertisement